
ఇది ఆరంభం మాత్రమే..
మర్రిపాలెం : అంగన్‌వాడీ కేంద్రాల్లో మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో నో ఫోన్ నో వర్క్ విధానాన్ని పాటిస్తామని.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. ప్రభుత్వం తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు. ఆర్‌అండ్‌బీ జంక్షన్ సమీపంలోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు సోమవారం సెల్‌ఫోన్లు రోడ్డుపై ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారుల సౌకర్యార్థం ఆఫ్‌లైన్‌లో మాత్రమే సేవలు అందిస్తామన్నారు. పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్‌లతో పనిభారం పెరగడంతో పాటు అదనంగా ఆరోగ్య శాఖకు చెందిన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం ద్వారా ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు చేయాల్సిన గర్భిణులు, బాలింతల నమోదు ప్రక్రియ సైతం తమకే అప్పగించడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆన్‌లైన్ విధానంతో సర్వర్ పనిచేయకపోవడం ఒక ఎత్తయితే మరో పక్క సెల్‌ఫోన్‌లు మొరాయించడంతో లబ్ధిదారులు అంగన్‌వాడీ కేంద్రాల చుట్టూ తిరుగుతూ తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాపోయారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోజుల వ్యవధిలో పనిభారం తగ్గించి వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చి, ఇప్పుడు అంగన్‌వాడీలను పూర్తిగా పక్కకు పెట్టేశారన్నారు. అనంతరం అర్బన్ సీడీపీవో నీలిమకు తమ సెల్ ఫోన్లు అప్పగించే ప్రయత్నం చేయగా.. ఫోన్‌లు ఇలా ఇవ్వడం వల్ల డేటా పోయే ప్రమాదముందని ఆమె సర్దిచెప్పారు. దీంతో ఆమెకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ గౌరవ అధ్యక్షురాలు మణి, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ నాయకులు ఎం.వెంకటలక్ష్మి, శ్యామలాదేవి, కృపారాణి, నూకరత్నం, అన్నపూర్ణ పాల్గొన్నారు.
ఆన్‌లైన్ సేవలు బహిష్కరించిన
అంగన్‌వాడీలు
సెల్ ఫోన్లతో ఐసీడీఎస్ కార్యాలయం ముందు రోడ్డుపై నిరసన