
రైతు భరోసా కేంద్రాలపై కూటమి కక్ష
● యూరియా సైతం పంపిణీ చేయలేని వైనం ● కూటమి ప్రభుత్వ హయాంలో 250 మంది అన్నదాతల ఆత్మహత్య ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం
మహారాణిపేట: రైతును రాజుగా చూడాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి భరోసాగా నిలిచారని, విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు మద్దతు ధర వచ్చేవరకు రైతన్నలకు జగన్ సర్కారు ధైర్యమిచ్చేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. రైతులకు యూరియా కొరత, ఇతర సమస్యలపై పార్టీ నాయకులు కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కే.కే.రాజు మాట్లాడుతూ గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా సరఫరా డిమాండ్‌కు తగ్గట్లుగా లేదని, చంద్రబాబు నాయుడు రైతులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని అన్నారు. నిన్న జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతులకు భరోసా ఉండదని చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాసన మండలి సభ్యురాలు వరుదు కల్యాణి మాట్లాడుతూ, జగన్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, ఇప్పుడు అది లేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు కేవలం రూ.5 వేలు మాత్రమే జమ చేసిందని, వారి సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోని రైతు భరోసా అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, మొల్లి అప్పారావు, జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ సుంకరి గిరిబాబు , డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ , పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవి రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు పేర్ల విజయ చందర్, జహీర్ అహ్మద్, గొలగాని శ్రీనివాస్, అల్లంపల్లి రాజబాబు, రాంబాబు, బంకు సత్యం, మువ్వల సురేష్, అంబటి నాగ శైలేష్, పేడాడ రమణికుమారి, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, కర్రి రామిరెడ్డి, వంకాయల మారుతీప్రసాద్, నీలి రవి, శశికళ , బిపిన్ కుమార్ జైన్, పల్లా దుర్గారావు, డాక్టర్ మంచా నాగ మల్లేశ్వరి, మక్సూద్ అహ్మద్ , ఇ.సత్యనారాయణ, కంచుమూర్తి పద్మ శేఖర్, శ్రీదేవి వర్మ , బోరవిజయ లక్ష్మి , రామకృష్ణారెడ్డి, అప్పన్న , శిరీష్ , మజ్జి జ్యోతి, మధుసూదన్ రెడ్డి, రామభక్త నాయుడు, సత్యవతి, పార్వతి పాల్గొన్నారు.