
త్వరితగతిన మార్గదర్శుల మ్యాపింగ్
మహారాణిపేట : పీ–4 మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని.. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమమని.. దానికి తగిన విధంగానే చర్యలు తీసుకోవాలని.. ఎవరిపైనా ఒత్తిడి లేదని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలకు మార్గదర్శులను మ్యాపింగ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర–2047 ప్రణాళికకు అనుగుణంగా నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు ఆయా శాఖల అధికారులంతా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. ఆయా శాఖల పరిధిలో నిర్వహించిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాల నివేదికలను పోర్టల్లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్ పాల్గొన్నారు.