ఆ జీవో విద్యార్థుల గొంతు నొక్కేందుకే..! | - | Sakshi
Sakshi News home page

ఆ జీవో విద్యార్థుల గొంతు నొక్కేందుకే..!

Aug 5 2025 11:00 AM | Updated on Aug 5 2025 11:00 AM

ఆ జీవో విద్యార్థుల గొంతు నొక్కేందుకే..!

ఆ జీవో విద్యార్థుల గొంతు నొక్కేందుకే..!

● విద్యాశాఖ ఉత్తర్వులు వెనక్కితీసుకోవాలి ● ఉత్తర్వుల కాపీని దహనం చేసిన ఎస్‌ఎఫ్‌ఐ

బీచ్‌రోడ్డు: పాఠశాలల్లో విద్యార్థుల స్వేచ్ఛను, ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ఉన్న విద్యాశాఖ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉత్తర్వుల ప్రతులను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.జె. నాయుడు మాట్లాడుతూ పాఠశాల విద్యా కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులు విద్యార్థులు తమ సమస్యలను బయటకు తెలియజేసే అవకాశాన్ని లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధమని, విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నమేనని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లే విద్యార్థి సంఘాలకు అనుమతి లభించదని, దీనివల్ల విద్యార్థుల సమస్యలు బయటకు రాకుండా పోతాయన్నారు. మంత్రి నారా లోకేష్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరిపేవారని, ఇప్పుడు అటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. ఒకవైపు రాజకీయాలకు తావివ్వొద్దని చెబుతూ, మరోవైపు పీటీఎం (పేరెంట్స్‌–టీచర్స్‌ మీటింగ్‌) పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఉత్తర్వులు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని, అరాచకాలను అడ్డుకునే అవకాశాన్ని లేకుండా చేస్తాయని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అభిప్రాయపడ్డారు. దీంతో ప్రైవేటు పాఠశాలల దోపిడీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ అప్రజాస్వామిక ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ హెచ్చరించింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి. అజయ్‌, ఉపాధ్యక్షుడు ఎం. కౌశిక్‌, ఎం. నరేష్‌, టి.మౌనిక, ఎం. కుసుమాంజలి, నాయకులు పి.ప్రగతి, ఎం.కావ్య, సీహెచ్‌. సూర్య, జి.సంజయ్‌, బి.భరత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement