● జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ● పీజీఆర్‌ఎస్‌కు 154 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 154 వినతులు వచ్చినట్లు మేయర్ తెలిపారు. పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 77 ఫిర్యాదులు అందాయి. ఇంజనీరింగ్ విభాగానికి 35, ప్రజారోగ్యానికి 7, రెవెన్యూకి 12, జీవీఎంసీ పరిపాలన, అకౌంట్స్ విభాగానికి 15, మొక్కల విభాగానికి 5, యూసీడీకి 3, ప్రధాన కార్యాలయానికి 42 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
జోనల్ కమిషనర్లతో కమిషనర్
వీడియో కాన్ఫరెన్స్
ప్రజా సమస్యల పరిష్కార వేదికపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించి కమిషనర్ కేతన్‌గార్గ్ జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ప్రజలు అందజేసిన ఆర్జీలు, ఫిర్యాదులను అదే రోజు పరిశీలించి, సంబంధిత ఫిర్యాదిదారులతో సంప్రదించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. అందిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ, ప్రధాన ఇంజనీర్ పల్లంరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవరెడ్డి, ఫైనాన్స్ అడ్వైజర్ మల్లికాంబ, డీసీఆర్ శ్రీనివాసరావు, పర్యవేక్షక ఇంజనీర్లు పీవీవీ సత్యనారాయణరాజు, కేవీఎన్ రవి, కె.శ్రీనివాసరావు, గోవిందరావు, సంపత్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.