
ఆ క్రషర్ మనదే...వదిలెయ్..!
వెంగమాంబలో పీలా గోవిందు పాత్ర బహిర్గతం
తాను భాగస్వామినంటూ స్వయంగా వెల్లడి ‘దాని జోలికి వెళ్లకు’ అని హెచ్చరిక సమాచారం అడిగిన సమాజ్‌వాది పార్టీ నేతకు ఫోన్ ‘సాక్షి’ చేతిలో ఆడియో రికార్డు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
మైనింగ్ వ్యవహారాలపై సమాచారం సేకరి స్తున్న సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన గురువయ్యకు పీలా గోవిందు ఫోన్ చేశారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న వెంగమాంబ క్రషర్స్‌లో భాగస్వామినంటూ ఆయనే స్వయంగా వెల్లడించారు. దాని జోలికి వెళ్లకని హెచ్చరించారు. ఆయన వాయిస్ రికా ర్డు ‘సాక్షి’కి చిక్కింది. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీయూఎఫ్‌ఐడీసీ) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పీలా గోవింద సత్యనారాయణ అక్రమ మైనింగ్‌లో భాగస్వా మి అనే విషయం పై మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఇన్ని రోజులుగా వెంగమాంబ స్టోన్ క్రషర్స్ తెరవెనుక ఉండి వ్యవహారాలను శ్రీనివాస చౌదరి చక్కబెడుతుండగా... అసలైన సూత్రధారి పీలా గోవిందని ఈ ఆడియో రికార్డుతో తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీనివాస చౌదరి బీజేపీలో ఉండగా.... పీలా గోవిందు టీడీపీలో ఉండి అనకాపల్లి జిల్లా లో అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని స్పష్టమవుతోంది. అసలు అనుమతి లేని, కోర్టు పరిధి లో ఉన్న క్వారీలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌లో అధికార పార్టీకి చెందిన నేతలు తమ పాత్ర స్వయంగా ఒప్పుకోవడం గమనిస్తే ఆశ్చర్యమేస్తోంది. తాము అక్రమ మైనింగ్ చేస్తున్నామని వారే నోరు విప్పి చెబుతున్నారంటే.. తమపై ఎవ్వరూ చర్యలు తీసుకోలేరనే ధైర్యమే కారణమని, ఆ ధీమా వారి మాటల్లో కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అనకాపల్లి అంతటా అక్రమ మైనింగే...!
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా భారీగా అక్రమ మైనింగ్ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఒక్క అనకాపల్లి మండలంలోనే ఏకంగా 30కి పైగా క్వారీల్లో అనుమతి లేకుండా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఒక్క మండలంలోనే రోజుకు 1000 ట్రిప్పుల బండరాళ్లు అనకాపల్లి రూరల్ ప్రాంతంలోని వివిధ అధికార, అనధికార క్వారీల నుంచి మునగపాక మీదుగా రాంబిల్లిలోని నావికాదళ పనుల వరకూ ప్రతి రోజూ చక్కర్లు కొడుతున్నాయి. 32–36 టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నా ఏకంగా 50 టన్నుల మేరకు భారీ బండరాళ్లు వేసుకుని తిరుగుతున్న ఈ టిప్పర్లను అటు మైనింగ్ అధికారులు కానీ, ఇటు రవాణాశాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులు కానీ కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఇక చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో చేపడుతున్న అధికార, అనధికార మైనింగ్ ద్వారా ప్రతి రోజూ పదుల సంఖ్యలో లారీల నుంచి కంకర తరలివెళుతోంది. గుర్తింపు ఉన్న క్వారీల నుంచి తరలిస్తున్న వాటికి సీనరేజి కింద ప్రభుత్వం వసూలు చేసే మొత్తానికి అదనంగా టన్నుకు రూ.250 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని కూటమి నేత ‘ఏపీ’ ట్యాక్స్ పేరుతో అధికారికంగా వసూలు చేస్తుండటం గమనార్హం. తద్వారా ప్రతి రోజూ రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే నెలకు రూ.3 కోట్ల మేర ‘ఏపీ’ ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు నర్సీపట్నం నియోజకవర్గంలో ఏకంగా లేటరైట్‌కు అటవీ మార్గం గుండా రైట్ రైట్ చెబుతున్నారు. అసలు ఎంత మొత్తం తరలిస్తున్నారనే లెక్కలను కూడా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. వారు చెప్పిందే లెక్క అనే రీతిలో అక్కడ వ్యవహారం నడుస్తోంది.
ఫోన్ చేసి నాదే అని చెప్పారు
అనకాపల్లి మండలంలోని అక్రమ మైనింగ్‌పై ఆర్‌టీఐ ద్వారా సమాచారం అడిగాను. వెంగమాంబ క్వారీ జోలికి వెళ్లక అని పీలా గోవిందు ఫోన్ చేశారు. అందులో తనకు వాటా ఉందని చెప్పారు. తన తండ్రి కాలం నుంచే శ్రీనివాస చౌదరి తండ్రితో వ్యాపార భాగస్వామ్యం ఉందని నాకు ఫోన్‌లో చెప్పారు. అక్రమ మైనింగ్ నడుస్తోందని నేను అంటే ఇలాంటివి బోలెడున్నాయని కూడా అన్నారు. ఇలా ఫోన్ చేయడం ఎలా కరెక్ట్?
– కోన గురువయ్య, సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి