
‘అతిథి’ ని‘బంధనాలు’
మద్దిలపాలెం: ఆంధ్ర యూనివర్సిటీలో అతిథి అధ్యాపకుల నియామక ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. కూటమి ప్రభుత్వం ఏరికోరి వీసీగా తీసుకొచ్చిన ఆచార్య జీపీ రాజశేఖర్ జారీ చేసిన వెబ్ నోటిఫికేషన్ ప్రస్తుత అతిథి అధ్యాపకుల పాలిట శాపంగా మారింది. దీంతో కొత్త విధానం వద్దు.. గతంలో ఉన్న రివ్యూ విధానాన్నే కొనసాగించాలంటూ అతిథి అధ్యాపకులు ఆందోళన బాట పట్టారు.
ఆరు మాసాల ముచ్చట
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏయూ ఇన్‌చార్జి వీసీగా ఆచార్య శశిభూషణ్‌రావును నియమించారు. ఆయన సిక్స్ మెన్ కమిటీ నేతృత్వంలో ఒక్కో పేపర్‌కు ఒక్కొక్కరి చొప్పున 250 మందిని గెస్ట్ ఫ్యాకల్టీలుగా నియమించారు. ఆర్ట్స్ కళాశాలలో వివిధ దశల్లో మరో 138 మందిని తీసుకున్నారు. ఇది జరిగి ఆరు మాసాలే అవుతోంది. ప్రస్తుత వీసీ ఈ విధానానికి తిలోదకాలిస్తూ మొత్తం గెస్ట్ ఫ్యాకల్టీల భర్తీకి వెబ్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ నెల రోజులుగా ఏయూలో వివిధ రూపాల్లో గెస్ట్ ఫ్యాకల్టీలు ఆందోళనలు చేస్తున్నారు. మంత్రులు, నేతలను వేడుకుంటున్నారు.
రెండు పేపర్లు.. ఒక ఫ్యాకల్టీ!
ప్రస్తుత వీసీ ఆధ్వర్యంలో ఒక ఫ్యాకల్టీ–రెండు పేపర్లు విధానం కొనసాగుతోంది. దీంతో సగం మంది గెస్ట్ ఫ్యాకల్టీలు అవకాశం కోల్పోతున్నారు. ఇప్పటి వరకూ పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. వీరిలో ఎవరు కొనసాగుతారో? తెలియని అయోమయం నెలకొంది.
ఐఐటీ ప్రొఫెసర్లతో ఇంటర్వ్యూలు
ప్రస్తుత వీసీ సెంట్రల్ యూనివర్సిటీ ఐఐటీ ప్రొఫెసర్లతో ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు. కెరియర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌లో ఇటీవల జరిగిన పదోన్నతులను ఇంటర్వ్యూ ప్రక్రియలోనే చేపట్టారు. వాస్తవంగా పదోన్నతులకు విభాగాధిపతుల చైర్మన్, బీవోఎస్ చైర్మన్, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌తో కమిటీ ఉంటుంది. ఈ విధానాన్ని పక్కన పెట్టేశారు. ఏయూ విధి విధానాలను అమలు చేయకుండా ప్రస్తుత వీసీ తన ఐఐటీ విధానాలను అమలు చేస్తున్నారంటూ యూనివర్సిటీ వర్గాలు మండిపడుతున్నారు. దీన్నే అతిథి అధ్యాపకుల నియామకాల్లోనూ అనుసరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
గతంలో నియామకాలిలా..
కళాశాల ప్రిన్సిపాల్ చైర్మన్‌గా, విభాగాధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌లు సభ్యులుగా ఒక కమిటీ ద్వారా అతిథి అధ్యాపకుల నియామకాలు జరిగేవి. ఏటా వారి పనితీరును రివ్యూ చేసి, పనితీరు బాగున్నవారిని కొనసాగించేవారు. ప్రస్తుత వీసీ కొత్తగా డీన్ ద్వారా నియామకాలు చేపట్టేందుకు పాత కమిటీని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇది యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధమని అతిథి అధ్యాపకులు ఆక్షేపిస్తున్నారు.
పాత విధానాన్నే
కొనసాగించాలి
యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం గతంలో మాదిరే గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం జరగాలి. వెబ్ నోటిఫికేషన్ విధానాన్ని రద్దు చేయాలి. అప్పడే అందరికీ న్యాయం జరుగుతుంది. దీనిపై గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నాం. ఇప్పటికై నా వీసీ మా గురించి ఆలోచించాలని వేడుకుంటున్నాం.
– ఎం.సురేష్‌మీనన్, అధ్యక్షుడు,
ఏయూ అతిథి అధ్యాపకుల సంఘం
ఏయూ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలపై
వీసీ ‘వెబ్’ శాసనం
ఆరు నెలలలోపే తమ ఆశల్ని
కాలరాస్తున్నారంటూ ఆవేదన
రివ్యూ విధానమే కొనసాగించాలని
గెస్ట్ ఫ్యాకల్టీల ఆందోళన