
ఆగస్ట్ 15 నుంచి ప్రారంభమయ్యేనా..?
● దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలపై వీడని సందిగ్ధత ● నత్తనడకన జోన్ కార్యాలయ నిర్మాణ పనులు ● జీఎం చాంబర్ కోసం తొలుతపాత ఓఎస్డీ కార్యాలయం ఎంపిక ● ఇప్పుడు వీఎంఆర్డీఏ డెక్‌లో స్పేస్ ఇవ్వాలని లేఖ రాసిన వాల్తేరు అధికారులు ● రైల్వే బిల్డింగ్‌లోనే తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకు బోర్డు మొగ్గు
సాక్షి, విశాఖపట్నం : ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది దక్షిణ కోస్తా రైల్వే జోన్ వ్యవహారం. సుదీర్ఘ పోరాటం తర్వాత జోన్ ప్రకటన వచ్చి.. ఆరేళ్లు దాటినా కార్యకలాపాలు మాత్రం ఇంతవరకూ ప్రారంభం కాకపోవడం విడ్డూరం. అధికార పార్టీ చేతిలో రాజకీయ పాచికగా మారిపోయిన జోన్‌కు జీఎంని నియమించి దాదాపు నెల రోజులు దాటినా.. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి దాపురించింది. ఓవైపు జోన్ ప్రధాన కార్యాలయ పనులు నత్తనడకగా సాగుతుండటం.. మరోవైపు తాత్కాలిక కార్యాలయ అన్వేషణ కూడా అదే తరహాలో జరుగుతుండగా.. ఆగస్ట్ 15 నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలన్న రైల్వే బోర్డు యోచనపైనా సందిగ్ధత కొనసాగుతోంది.
కదలని ఆపరేషన్స్
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌గా సందీప్ మాధుర్‌ని రైల్వే శాఖ గత నెల 5న నియమించింది. అదే రోజున ఆయన ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. 10 రోజుల తర్వత విశాఖకి వచ్చి.. వాల్తేరు డివిజన్ అధికారులతో డీఆర్‌ఎం కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలోనే తాత్కాలిక కార్యకలాపాల ప్రారంభంపైనా చర్చలు కొనసాగాయి. ఆగస్ట్ 15 నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టాలని రైల్వే బోర్డు సూచించినట్లు తెలుస్తోంది. అందుకే.. ప్రధాన కార్యాలయ నిర్మాణానికి రెండేళ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. తాత్కాలిక కార్యాలయాన్ని ఎంపిక చేసి.. జోన్ కార్యకలాపాల్ని ప్రారంభించాలని భావించారు. అయితే.. ఇంతవరకూ ఎంపికపై ఎలాంటి స్పష్టత రాకపోవడం గమనార్హం. దీంతో జోన్‌కు జనరల్ మేనేజర్‌ను నియమించి నెల దాటినా ఆపరేషన్స్ మాత్రం అడుగు ముందుకు పడటం లేదు.
గెజిట్ ఇంకా విడుదల కాలేదు..
ఆగస్టు 15 నుంచి విశాఖలో జీఎం తాత్కాలిక కార్యాలయం ప్రారంభమవుతుందని అంతా భావిస్తున్నారు. ఈలోగా ఆఫీస్‌ని ఎంపిక చేసి జీఎం కార్యాలయానికి అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదని వాల్తేరు అధికారులు చెబుతున్నారు. జోన్‌కు సంబంధించిన గెజిట్ కూడా ఇంతవరకూ విడుదల చేయలేదు. గెజిట్‌తో కార్యాచరణ ప్రకటిస్తే జీఎంతో పాటు అసిస్టెంట్ జీఎం, ఇతర 10 విభాగాలు, వాటి ప్రిన్సిపల్ హెచ్‌వోడీలు, సంబంధిత అధికారులు సిబ్బంది సహా మొత్తంగా 180 మంది వరకూ అధికారులు, ఉద్యోగులు వస్తారు. వీరందరి నియామకం జరిగిన తర్వాతే జోన్ ఆపరేషన్స్ మొదలయ్యే అవకాశాలున్నాయి. తొలుత జీఎం చాంబర్‌ని ఎంపిక చేసి.. వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న అధికారులు, ఉద్యోగులతో మిగిలిన వ్యవహారాలు నడిపించాలని రైల్వే శాఖ భావిస్తోంది.
ఎక్కడ కూర్చోవాలి ?
జీఎం కార్యాలయానికి భవన ఎంపికపై వాల్తేరు డివిజన్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. తొలుత డీఆర్‌ఎం కార్యాలయాన్ని ఎంపిక చేశారు. అయితే జీఎం స్థాయిలో అక్కడ వసతులు లేవని భావించారు. తర్వాత దక్షిణ కోస్తా జోన్ డీపీఆర్ తయారు చేసేందుకు నియమించిన ఓఎస్‌డీ కోసం రైల్వే స్టేషన్ 8వ ప్లాట్‌ఫారం సమీపంలో జ్ఞానాపురం వైపు ఓ కార్యాలయాన్ని అప్పగించారు. ప్రస్తుతం ఆ భవనం ఖాళీగా ఉంది. అక్కడ ఏర్పాటు చేయాలని అనుకున్నా.. జీఎం చాంబర్‌కు, సరిపడా సిబ్బందికి అవసరమైన గదులు లేకపోవడంతో ఆలోచన చేస్తున్నారు. ఇంతలో వీఎంఆర్‌డీఏ కొత్తగా నిర్మించిన డెక్‌లో స్థలం కావాలంటూ వాల్తేరు రైల్వే అధికారులు వీఎంఆర్‌డీఏకు లేఖ రాశారు. ప్రస్తుతం ఇది పరిశీలనలో ఉంది. అయితే బోర్డు మాత్రం రైల్వేకు సంబంధించిన ఆస్తుల్లోనే తాత్కాలిక కార్యాలయం కూడా ఉండేలా చూడాలని సూచించడంతో.. ఇప్పటివరకు జీఎం ఆఫీస్ ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో జోన్ జనరల్ మేనేజర్ మళ్లీ విశాఖ వైపు కూడా చూడలేదు. వచ్చి బాధ్యతలు చేపట్టాక ఎక్కడ కూర్చోవాలనే అంశం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఢిల్లీ నుంచి ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఇక్కడి అధికారులతో సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది.