
ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోతే పట్టాల రద్దు
విశాఖ సిటీ : జిల్లాలో పేద, బలహీనవర్గాల కోసం నిర్మిస్తున్న గృహ నిర్మాణాల ప్రగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ సంస్థ చేపడుతున్న పేదల గృహాల పరిస్థితి, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామ సచివాలయాల్లో వచ్చే వారంలో గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. ఈ గ్రామ సభలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఏమినిటీస్ సెక్రటరీ, హౌసింగ్ ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇంకా ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే ఇచ్చిన ఇళ్ల పట్టాలతో పాటు మంజూరైన ఇళ్లు రద్దు చేయడం జరుగుతుందనే విషయం లబ్ధిదారులకు చేరాలన్నారు. సభ జరిగిన ఒక వారంలో ఇంటి నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాకపోతే నోటీసులు జారీ చేసి ఇళ్లు రద్దు చేయాలని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది నాటికి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ లేఅవుట్లలో పూర్తి స్థాయి లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణాల్లో నాణ్యత లోపి స్తే గృహ నిర్మాణ శాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హౌసింగ్ పీడీ సత్తిబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృష్ణా రెడ్డి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ శ్యామ్ బాబు, జీవీఎంసీ ఎస్‌ఈ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.