
జీవీఎంసీకి స్వచ్ఛ పురస్కార్
సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ ప్రత్యేక కేటగిరీలో ప్రథమ స్థానం
డాబాగార్డెన్స్: స్వచ్ఛభారత్ మిషన్ 2.0లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2024కు గానూ జీవీఎంసీ జాతీయ స్థాయి స్వచ్ఛ పురస్కారాన్ని దక్కించుకుంది. సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ ప్రత్యేక కేటగిరీలో ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్–2024 అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ చేతుల మీదుగా మేయర్ పీలా శ్రీనివాసరావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్‌తో కలిసి ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రత్యేక కేటగిరీలో జీవీఎంసీ ప్రథమ స్థానం సాధించడం విశాఖ నగరానికి ఎంతో గౌరవమన్నారు. ఈ ఘనత సాధించడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో ఉందని, ఇందుకు సహకరించిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్లు, నివాసిత సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, జీవీఎంసీ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షణ్–2025లో కూడా జీవీఎంసీ ఉత్తమ పరిశుభ్ర నగరంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ప్రధాన ఇంజినీర్ పల్లంరాజు పాల్గొన్నారు.