
అయ్యో.. రొయ్య!
● రొయ్యల ధర తగ్గింపుతో ఆందోళనలో మత్స్యకారులు ● గిట్టుబాటు కావడం లేదంటున్న గంగపుత్రులు ● ధర పెంచాలని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
మహారాణిపేట: అలల మీద ఆశలతో.. ప్రాణాలను పణంగా పెట్టి రోజుల తరబడి సముద్రంలో వేటాడితే.. తీరానికి చేరాక వారి కష్టానికి దక్కేది కన్నీళ్లే. విశాఖ మత్స్యకారుల బతుకులు ప్రస్తుతం ఇలాగే మారాయి. ముఖ్యంగా రొయ్యల వేటపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు.. ఎగుమతిదారులు, మధ్యవర్తులు కలిసి ఆడుతున్న ధరల నాటకంలో నలిగిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాక.. చేసిన అప్పులు తీర్చలేక సముద్రమంత శ్రమ.. బూడిదలో పోసిన పన్నీరవుతోందని గంగపుత్రులు గగ్గోలు పెడుతున్నారు.
ఎగుమతిదారుల ఏకపక్ష వైఖరి
ఒకప్పుడు విశాఖ కేంద్రంగా 8 మంది ఎగుమతిదారులు రొయ్యలు కొనుగోలు చేసేవారు. దీంతో పోటీ ఉండి, మత్స్యకారులకు మంచి ధర లభించేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం మూడుకు పడిపోయింది. ఈ ముగ్గురూ సిండికేట్‌గా మారి ధరలను శాసిస్తున్నారని, వారికి తోడు మధ్యవర్తులు కూడా తమ కమీషన్ల కోసం మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘సముద్రంలో దొరికే నాణ్యమైన రొయ్యల కన్నా.. ఆక్వా కల్చర్ రొయ్యలకే ఎగుమతిదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్నిసార్లు మేము తెచ్చిన రొయ్యలను కొనడానికి కూడా ఇష్టపడటం లేదు. దీంతో తెచ్చిన సరుకు అమ్ముడుపోక, అప్పుల పాలవుతున్నాం’ అని ఓ మర పడవ యజమాని తన ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యవర్తులు అవసరానికి అప్పులిచ్చి, ఆ తర్వాత ధర నిర్ణయంలో చక్రం తిప్పుతూ మత్స్యకారులను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వమే ఆదుకోవాలి
విశాఖ జిల్లాలో 65 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. జిల్లాలో మొత్తం 2,547 అన్ని రకాల బోట్లు ఉన్నాయి. సుమారు 1.15 లక్షల మత్స్యకార కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఫిషింగ్ హార్బర్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి. మత్స్యశాఖ అధికారులు చొరవ తీసుకుని, ఎగుమతిదారులు, మరపడవల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధర కల్పించాలి. సముద్రంలో వేటాడి తెచ్చిన రొయ్యలను ఎగుమతిదారులు తప్పనిసరిగా కొనుగోలు చేసేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. లేకపోతే తమ బతుకులు సముద్రంలో కలిసిపోవడం ఖాయమని ఆవేదన చెందుతున్నారు.
పెట్టుబడి భారమాయే..
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రొయ్యల ధరలను ఎగుమతిదారులు భారీగా తగ్గించేశారు. ఇది మత్స్యకారుల నడ్డి విరుస్తోంది. బోటుకు డీజిల్, కళాసీల జీతాలు, వలల మరమ్మతులు, ఐస్, రేషన్ ఖర్చులు తడిసి మోపెడవుతుంటే.. తీరా అమ్మకానికి వచ్చేసరికి ధరలు పాతాళంలోకి పడిపోయాయని వారు వాపోతున్నారు.
ఽదరల పతనంతో తీరని నష్టం
రొయ్య రకం గత ఏడాది ప్రస్తుత నష్టం
ధర ధర
బ్రౌన్ రొయ్య 420 300 120
వైట్ రొయ్య 550 400 150
ఫ్లవర్ రొయ్య 550 500 50
టైగర్ రొయ్య 1200 1150 50
పట్టికలో చూస్తేనే అర్థమవుతోంది నష్టం ఏ స్థాయిలో ఉందో.! ముఖ్యంగా ఎక్కువగా దొరికే బ్రౌన్ రొయ్యపై ఏకంగా రూ.120 తగ్గించడం దారుణమని, కనీసం కిలోకు రూ.400 అయినా ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ.. వారి మాట వినే నాథుడే కరువయ్యాడు.
రొయ్యల ధర గిట్టుబాటు కావడం లేదు
రొయ్యల ధర గిట్టుబాటు కాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రస్తుతం 3 నుంచి 5 మంది ఎగుమతిదారులు మాత్రమే రొయ్యలను కొనుగోలు చేస్తుండటంతో మాకు సరైన ధర లభించడం లేదు. పైగా ఈ ఏడాది రొయ్యల ధరలు దారుణంగా పడిపోయాయి. గత ఏడాది ఇచ్చిన ధర కంటే ఇప్పుడు మరింత తగ్గిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మంది ఎగుమతిదారులు రొయ్యలను కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలి.
– పీసీ అప్పారావు, గౌరవ అధ్యక్షుడు
ఏపీ మరపడవల సంఘం
స్టోరేజ్ సదుపాయం కల్పించాలి
రొయ్యలను తగినంత నిల్వ చేసుకునే సదుపాయం లేకపోవడం వల్ల నష్టపోతున్నాం. దీంతో ఎగుమతిదారులు తమకు నచ్చిన ధరలు నిర్ణయిస్తున్నారు. ఒక్కోసారి వేటాడి తెచ్చిన రొయ్యలను కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ఆక్వా కల్చర్ రొయ్యల కొనుగోలుపై చూపిస్తున్న శ్రద్ధ సముద్రం నుంచి వేటాడి తెచ్చిన రొయ్యలపై చూపించడం లేదు. సముద్రపు రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, ఎగుమతిదారులు సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రొయ్యలకు తగినంత స్టోరేజ్ సదుపాయాలను కల్పించాలి.
– సూరాడ సత్యనారాయణ ,
మత్స్యకారుడు

అయ్యో.. రొయ్య!