
మెట్రో ప్రాజెక్టు భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ
సీతంపేట: విశాఖపట్నం మెట్రోరైల్ ప్రాజెక్టు ఫేజ్–1 (కారిడార్ 1, 2, 3) నిర్మాణానికి సంబంధించి భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గురువారం ఉదయం అక్కయ్యపాలెంలోని అబిద్‌నగర్‌లోని షాదీఖానా కల్యాణ మండపం, గురుద్వారా జంక్షన్, ఆశీల్‌మెట్టలోని వేమన మందిరంలో జోనల్ కమిషనర్లు బి.రాము, కె. శివప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కారిడార్ 1, 3లకు సంబంధించిన భూములు, నివాస, వ్యాపార, ఖాళీ స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులు, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఏ టీమ్ సామాజిక నిపుణుడు పి. దేవరాజు మాట్లాడుతూ మెట్రోరైల్ ప్రాజెక్టు భూసేకరణలో మొత్తం 312 గృహ, వ్యాపార, ఖాళీ స్థలాలకు నష్టం జరుగుతుందన్నారు. కారిడార్ 1లో 74 ఇళ్లు, ప్రహారీ గోడలు, ఖాళీ స్థలాలు పాక్షికంగా, 20 ఇళ్లు పూర్తిగా నష్టపోతాయని తెలిపారు. కారిడార్ 3లో 3 ఇళ్లు పూర్తిగా, 23 ఇళ్లు కొంత మేర నష్టపోతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు, ప్రజల నుంచి ఈ ప్రాజెక్టుపై అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. ఎక్కువ మంది నిర్వాసితులు స్టేషన్ పాయింట్లను ప్రైవేటు ఆస్తుల్లో కాకుండా ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల సేకరించిన అభిప్రాయాలు, సూచనలను రికార్డు చేసి.. కలెక్టర్‌కు నివేదికను సమర్పిస్తామన్నారు. ఎస్‌ఐఏ టీమ్ పర్యావరణ సామాజిక నిపుణుడు ఎ.మాధవరెడ్డి, మెట్రో ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్, డిప్యూటీ తహసీల్దార్ పద్మావతి, సర్వేయర్ శ్రీనుబాబు, ఆర్‌ఐ మురళీకృష్ణ, గాజువాక తహసీల్దార్ శ్రీనివాస్, మెట్రో రైల్ ప్రాజెక్టు ఇంజనీర్లు ఎన్. వసంత్, కె.ఎ.పరదేశిబాబు, కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.