
డిజిటల్ యుగంలో నాణ్యమైన విద్య అవసరం
ఐఐక్యూఏ సీఈవో డాక్టర్ టి.రవీందర్ రెడ్డి
మద్దిలపాలెం: డిజిటల్ యుగంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడిటేషన్ (ఐఐక్యూఏ) సీఈవో డాక్టర్ టి.రవీందర్ రెడ్డి అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న శతాబ్ది వాణి కార్యక్రమంలో గురువారం ఆయన ప్రసంగించారు. సాంకేతికత నేడు బోధన, అభ్యసన రంగాల్లోకి ప్రవేశిందని చెప్పారు. కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులు నేడు ఏఐతో పోటీ పడాల్సిన అవసరం ఏర్పడుతోందని చెప్పారు. జ్ఞానం, నైపుణ్యాలు, వ్యక్తిత్వం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. క్యూఎస్ ర్యాంకింగ్, నాక్ ర్యాంకింగ్ వంటివి సాధించడం ద్వారా మెరుగైన ప్రమాణాలను నిలుపుకోవడం సాధ్యపడుతుందని తెలిపారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ గ్లోబల్ కాంపిటేషన్‌కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలు కార్పొరేట్ వ్యవస్థలతో పోటీ పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కళాశాలలు వివిధ గుర్తింపులకు దరఖాస్తు చేయాలని, తద్వారా కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు.