
‘సాంకేతిక’ విద్యార్థుల ఆందోళన
మధురవాడ: ఆళ్వార్‌దాస్ విద్యా సంస్థలకు చెందిన సాంకేతిక విద్యాపరిషత్ కళాశాల విద్యార్థులు ఆగ్రహించారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ గురువారం ఉదయం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యాజమాన్యం కనీస సదుపాయాలను కల్పించడం లేదని, కళాశాల వేళలను ఏకపక్షంగా మార్చిందని ఆరోపిస్తూ.. సుమారు 2,500 మంది ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ విద్యార్థులు మూకుమ్మడిగా తరగతులు బహిష్కరించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా కళాశాల ప్రధాన భవనం ఎదుట ప్లకార్డులు పట్టుకుని, యాజమాన్య తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. పీఎంపాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని ఈ కళాశాలలో జరిగిన ఆందోళన నగరంలో చర్చనీయాంశమైంది.
ఇవీ విద్యార్థుల ఫిర్యాదులు
● ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు ఉన్న కాలేజీ వేళల సమయాన్ని 9 గంటల నుంచి 5 గంటల వరకు పెంచడం.
● కేవలం 5 నిమిషాలు ఆలస్యమైనా హాజరు వేయకపోవడం, హాజరు తక్కువైతే ‘కోఆర్డినేషన్’పేరుతో భారీ జరిమానాలు వసూలు చేయడం.
● యూడీఎఫ్ పేరుతో బిల్డింగ్ ఫీజు ఎక్కడా లేని విధంగా రూ. 9,000 వసూలు చేయడం, ఆలస్య రుసుం రోజుకు రూ. 200 విధించడం.
● ఫీజు బకాయిలున్న విద్యార్థులకు పరీక్ష హాల్‌టికెట్లు ఇవ్వకపోవడం.
● సాయంత్రం 5.30 వరకు కాలేజీ వేళలు ఉండటంతో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చినా గేట్లు తెరవకపోవడం. అనకాపల్లి, పెందుర్తి, ఎస్.కోట వంటి సుదూర ప్రాంతాల విద్యార్థులు ఇంటికి చేరుకునే సరికి రాత్రి అవుతోందని ఆవేదన.
● ఫ్యాకల్టీ సరిగా లేరు. ఫ్యాన్లు కూడా సరిగా తిరగడం లేదు.
● ఇంటి నుంచి టిఫిన్ తెచ్చుకున్నా క్యాంటీన్‌లో తిననివ్వకపోవడం.
తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు
బి.ఫార్మసీ విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ లేదని, రెండు రోజుల పాటు పూర్తిగా నీరు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డామని పేర్కొన్నారు. ల్యాబ్‌లలో కూడా నీరు లేదని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
బెదిరింపులు, వేధింపులు
ఒకవేళ ఎవరైనా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. తమ వద్ద ప్రాక్టికల్స్ మార్కులు, సర్టిఫికెట్లు ఉన్నాయని బెదిరిస్తోందని, బ్రేక్ టైం కూడా తీసేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
ఎస్‌ఎఫ్‌ఐ మద్దతు
ఈ ఆందోళనకు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) విశాఖ జిల్లా కమిటీ మద్దతు తెలిపింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్.జె.నాయుడుతో పాటు భరత్, నిఖిల్, సూర్య తదితర నాయకులు కాలేజీకి చేరుకుని విద్యార్థులతో కలిసి యాజమాన్యంతో చర్చలు జరిపారు. పీఎంపాలెం పోలీసు ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు భాస్కరరావు, రాము తమ సిబ్బందితో చేరుకుని విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
యాజమాన్యం తీరును నిరసిస్తూ..
మూకుమ్మడిగా తరగతుల బహిష్కరణ
కళాశాల టైమింగ్స్ పెంచడంతో
భగ్గుమన్న విద్యార్థిలోకం
మద్దతు పలికిన ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు
సోమవారం నిర్ణయం ప్రకటిస్తామన్న యాజమాన్యం
సోమవారం వరకు గడువు
విద్యార్థి సంఘ నాయకుల సమక్షంలో యాజమాన్యంతో జరిగిన చర్చల్లో.. సోమవారం లోపు తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే నిరవధికంగా తరగతులు బహిష్కరిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి విద్యనందించి, ఫలితాలు పెంచేందుకే వేళలు పెంచామని యాజమాన్య ప్రతినిధులు వివరించారు. తాము కూడా విద్యార్థుల ఇబ్బందులను బోర్డు డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి.. సోమవారం నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.

‘సాంకేతిక’ విద్యార్థుల ఆందోళన