
ఓపెన్ కుట్ర!
పార్క్ స్థలాలపై
● స్వయంగా మంత్రి నారాయణ సిఫారసు ● ‘రియల్’ ప్రయోజనాలకు మధురవాడ జీవీఎంసీ పార్కు స్థలం ● కనీసం కౌన్సిల్ సమావేశం లేకుండానే పార్కు స్థలాల అప్పగింత ● నరవలోని పార్కు స్థలాన్ని ఓపెన్ స్పేస్‌గా చెబుతూ చక్రం తిప్పిన మరో ఎమ్మెల్యే ● 20 ఎకరాలను రాయించుకుని తన ‘గుణా’న్ని బయటపెట్టుకున్న అధికారపార్టీ ‘బాబు’ ● తతంగమంతా ఆయన ‘రియల్’ ప్రయోజనాల కోసమే... ● చేష్టలుడిగి చూస్తున్న మేయర్, డిప్యూటీ మేయర్
ఇది 1981లో సాంఘిక సంక్షేమశాఖ నరవ రెవెన్యూ గ్రామ పరిధిలో వేసిన లే–అవుట్. ఇందులో మార్క్ చేసింది పార్కు స్థలం. అయితే, ఇప్పుడు అధికార ఎమ్మెల్యే తన ‘గుణ’ం చూపించడంతో ఇది కాస్తా పార్కు స్థలం కాకుండా పోయింది. బహిరంగ ప్రదేశం (ఓపెన్ స్పేస్) అని రికార్డులను తారుమారు చేసి వెనుక ఉన్న 20 ఎకరాల రియల్ ఎస్టేట్ భూమికి రోడ్డు కోసం 180 గజాల స్థలాన్ని తీసేసుకునేందుకు అనుకూలంగా మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
ఇది స్వయంగా మున్సిపాలిటీలకు చెందిన పార్కు స్థలాలను కాపాడాల్సిన సంబంధిత మంత్రి నారాయణ మధురవాడలోని బటర్ ఫ్లై పార్కు స్థలాన్ని అప్పగించాలంటూ సిఫారసు చేస్తూ రాసిన లేఖ. దీంతో ఏకంగా కనీసం కౌన్సిల్ సమావేశం కూడా లేకుండానే రోడ్డు కనెక్టివిటీ లేని స్థలాన్ని జీవీఎంసీకి అప్పగించి.. పార్కు స్థలాన్ని కొట్టేశారు.
ఈ రెండు వ్యవహారాల్లోనూ నిబంధనల మేరకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. అయితే రెండింటిలోనూ కేవలం
అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రి చక్రం తిప్పడంతో ఏకంగా మున్సిపల్ పార్కు స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఒకవైపు జీవీఎంసీ పార్కు స్థలాన్ని అప్పగించి...
కనెక్టివిటీ లేని స్థలాన్ని తీసుకుంటుండగా...మరో దగ్గర ఉన్న పార్కు స్థలాన్ని పార్కు కాదు... ఓపెన్ స్పేస్ అంటూ భూ బదలాయింపు కింద రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం తీసుకోవడం గమనార్హం. అయినప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్లు నోరు మెదపకపోవడం గమనార్హం. అంతేకాకుండా పెందుర్తి నియోజకవర్గంలోని నరవ పార్కు స్థలం విషయంలో
నియోజకవర్గ ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా వేరే నియోజకవర్గ ఎమ్మెల్యే చక్రం తిప్పారు. అంతేకాకుండా సంబంధిత భూములు కూడా ఆయనకు చెందిన
బినామీ చేతుల్లోనే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
మధురవాడలోని 1.05 ఎకరాల లేఅవుట్ ఓపెన్ స్పేస్‌లో బటర్‌ఫ్లై పార్కును జీవీఎంసీ అభివృద్ధి చేస్తోంది. అయితే, ఈ పార్కు వెనుక స్థానిక కూటమి నేతకు చెందిన 2 ఎకరాల భూమి ఉంది. ఆ నేత తన భూమికి రోడ్డు మార్గం కోసం పార్కు స్థలంలోని కొంత భాగాన్ని తీసుకుని, దానికి బదులుగా తన భూమిలో కొంత స్థలాన్ని జీవీఎంసీకి ఇచ్చేందుకు పావులు కదిపారు. ఇందుకోసం కూటమిలోని సీనియర్ ఎమ్మెల్యేను కలిసి ‘వాటాలు’ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే తనకున్న మున్సిపల్ శాఖలోని ‘బలాన్ని’ ఉపయోగించి, స్థలాన్ని అప్పగించేందుకు వీలుగా వ్యవహారాలను నడిపారు. దీనికి అనుగుణంగా మున్సిపల్ శాఖ ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఈ బదలాయింపుతో వెనుక ఉన్న 2 ఎకరాల భూమి విలువ ఒక్కసారిగా పెరిగి, గజం ఏకంగా రూ. 50 వేల రిజిస్ట్రేషన్ విలువ పలికే స్థాయికి చేరుకుంది. ఇది కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే జీవీఎంసీ పార్కు స్థలాన్ని అప్పగించారనడానికి స్పష్టమైన నిదర్శనం.
నరవ రెవెన్యూ గ్రామంలో
పార్కు స్థలం మాయం
పెందుర్తి నియోజకవర్గంలోని నరవ రెవెన్యూ, జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని సర్వే నంబరు 10/9లో 1981లో సాంఘిక సంక్షేమశాఖ వేసిన లేఅవుట్‌లో పార్కు స్థలంగా గుర్తించిన 180 గజాల స్థలాన్ని ఇచ్చేయాలని, అందులో 12 మీటర్ల రహదారి నిర్మించుకుంటానని ఆ లేఅవుట్ వెనుక 20 ఎకరాలను తన అనుచరుల చేతుల్లో ఉంచుకున్న కూటమి ఎమ్మెల్యే చక్రం తిప్పారు. వాస్తవానికి ఈ 20 ఎకరాల స్థలం సదరు ఎమ్మెల్యేదే అనే ప్రచారం ఉంది. ఇందుకోసం లేఅవుట్‌లోని పార్కు స్థలాన్ని ‘ఓపెన్ స్పేస్’గా అబద్ధపు రికార్డులు సృష్టించి, అనుమతి వచ్చే విధంగా అధికార పార్టీ నేతలు తమ నిజస్వరూపాన్ని చూపించారని తెలుస్తోంది. ఈ రెండు వ్యవహారాల్లోనూ జీవీఎంసీ పరిధిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కు స్థలాలను కూటమి నేతలు తమ రియల్ ప్రయోజనాల కోసం కాజేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా కనీసం జీవీఎంసీ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.
కౌన్సిల్‌కు తెలియకుండానే...!
వాస్తవానికి జీవీఎంసీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కౌన్సిల్, స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా పనులు చేపట్టినప్పటికీ... తర్వాత ర్యాటిఫై కోసమైనా కౌన్సిల్, స్టాండింగ్ కమిటీకు వెళ్లాల్సిందే. అయితే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను బలవంతంగా లాక్కోవడం ద్వారా అటు కౌన్సిల్‌లోనూ, ఇటు స్టాండింగ్ కమిటీలోనూ కూటమి నేతలదే మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్‌లో ఉంచి పార్కు స్థలాల అప్పగింతపై అనుమతి తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ కౌన్సిల్‌ను కనీసం పట్టించుకోకుండా వ్యవహారాలు నడుపుతున్నారు. దీనిపై అటు మేయర్ కానీ, ఇటు డిప్యూటీ మేయర్ కానీ కనీసం అడిగే సాహసం కూడా చేయలేకపోవడం దారుణంగా ఉందని ఆ పార్టీ కార్పొరేటర్లే వాపోతున్నారు. అయితే కౌన్సిల్ ముందు ఉంచితే వీటిని వ్యతిరేకించే అవకాశం ఉందనే ఆందోళనతోనే నేరుగా వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ జీవీఎంసీ కౌన్సిల్ అనుమతితోనే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ స్పష్టంగా తన అభిప్రాయంగా పేర్కొంది. అయినప్పటికీ తోసిరాజని నేరుగా మంత్రి, ఎమ్మెల్యేల సిఫారసుతో వ్యవహారాలను చక్కబెట్టుకుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

ఓపెన్ కుట్ర!

ఓపెన్ కుట్ర!

ఓపెన్ కుట్ర!