
షీలానగర్‌లో చోరీ.. హైదరాబాద్‌లో సుపారీ హత్య
● ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన మలక్‌పేట్ పోలీసులు ● వారి నుంచి కొంత సొత్తు స్వాధీనం ● నిందితులను కస్టడీకి తీసుకునేందుకు గాజువాక పోలీసులు చర్యలు
గాజువాక: హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో జరిగిన ఒక హత్య కేసు.. ఇక్కడి షీలానగర్‌లోని పెళ్లింట్లో జరిగిన భారీ దొంగతనం కేసులో నిందితులను పట్టించింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో జరిగిన హత్య కేసును విచారించిన పోలీసు అధికారులు శనివారం నిర్ధారించారు. ఈ మేరకు ఇద్దరు నిందితుల నుంచి ఇక్కడి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. షీలానగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న ఎల్‌ఐసీ ఉద్యోగి ఇంట్లో ఈనెల 13వ తేదీన భారీ దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసిన గాజువాక పోలీసులు అన్ని రకాలుగా విచారించారు. ఈనెల 14న హైదరాబాద్‌లో జరిగిన ఒక సుపారీ హత్య కేసులో ఇక్కడి దొంగతనంలో ఉన్న ఇద్దరు నిందితులు పాల్గొన్నట్టు అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. ఆ కేసులో ఏ4గా ఉన్న అర్జున్ జ్ఞానప్రకాష్, ఏ5గా ఉన్న లింగిబేడి రాంబాబు నుంచి షీలానగర్‌లో దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ హత్య కేసును ఒక సుపారీ గ్యాంగ్ చేసిందని.. అనంతరం అర్జున్, రాంబాబు నెల్లూరు వైపు వెళ్లిపోతుండగా కావలి వద్ద అరెస్టు చేసినట్టు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వారిని విచారించిన సమయంలో షీలానగర్‌లో జరిగిన దొంగతనం కేసు వెలుగుచూసింది. దొంగతనంలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు, వారిలో ఒకరు నెల్లూరు జిల్లాకు వెళ్లిపోయినట్టు మిగిలిన ఇద్దరు పోలీసులకు చెప్పారు. దీంతో వారివద్ద ఉన్న చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సొత్తును మూడు సమాన వాటాలు వేసి ముగ్గురూ పంచుకున్నట్టు నిందితులు తెలిపినట్టు సమాచారం. అయితే, దొంగతనం కేసులో నిందితులు రూ.20 లక్షల నగదును కూడా దోచుకెళ్లిపోయిన విషయం తెలిసిందే. మూడో నిందితుడు దొరకని కారణంగా ఆ నగదు వివరాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించినట్టు తెలిసింది. ఇక్కడి దొంగతనం గురించి అక్కడి పోలీసులకు వివరించారు. హత్య కేసులో వారిని రిమాండ్‌కు తరలించడంతో ప్రస్తుతానికి గాజువాక పోలీసులు తదుపరి చర్యల కోసం ప్రయత్నిస్తున్నారు. నిందితులను కోర్టు ద్వారా తమ కస్టడీకి తీసుకోవడం కోసం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్‌ను ప్రారంభించినట్టు పోలీసువర్గాల సమాచారం. కాగా నిందితులంతా పాత నేరస్తులని చెబుతున్నారు. ఒక్కొక్కరిపై పదిహేను కేసులున్నట్టు తెలుస్తోంది.