
ఏయూకు జాతీయ జియోస్పేషియల్ అవార్డు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ జియోస్పేషియల్ అవార్డు 2025 (ఎడిషన్ 2)’లో ఉత్తమ విశ్వవిద్యాలయ జ్యూరీ అవార్డు లభించింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, ఐసీటీ ద్వారా జాతీయ విద్యా మిషన్ కింద ఫాసీ జీఐఎస్ ఈ అవార్డులను ప్రదానం చేసింది. జియోస్పేషియల్ రంగంలో ముఖ్యంగా జీఐఎస్ విద్య, పరిశోధన, కమ్యూనిటీ ఔట్రీచ్‌లలో ఏయూ చేసిన విశిష్టమైన, దీర్ఘకాలిక కృషికి ఈ గుర్తింపు లభించింది. వర్సిటీకి అవార్డు లభించడం పట్ల వీసీ ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే జియో–ఇంజనీరింగ్, రిమోట్ సెన్సింగ్, టీవీఎస్ కేంద్రం పూర్వ విభాగాధిపతి ప్రొఫెసర్ వజీర్ మహమ్మద్‌కు కూడా నేషనల్ జియోస్పేషియల్ ఫ్యాకల్టీ విభాగంలో జ్యూరీ అవార్డు లభించింది. గత 35 ఏళ్లుగా జియోస్పేషియల్ రంగంలో ఆయన చేసిన ప్రభావవంతమైన కృషికి ఈ అవార్డు లభించిందని సహచరులు హర్షం వ్యక్తం చేశారు.