
టూరిజం సర్క్యూట్ హబ్‌గా భీమిలి
అల్లూరి జయంతిలో మంత్రి కందుల దుర్గేష్
పద్మనాభం : జిల్లాలోని పలు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు భీమిలిని సర్క్యూట్ హబ్‌గా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మండపంలోని పాండ్రంగిలో శుక్రవారం నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ఆయన ఈ విషయం వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జన్మస్థలం పాండ్రంగి, పొట్నూరులోని శ్రీకృష్ణదేవరాయల విజయస్తంభం,పద్మనాభం యుద్ధ స్థలం, గిరిపై అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు 22 ఏళ్ల వయసులోనే మన్యంలో గిరిజనులు పడుతున్న కష్టాలు చూసి బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన మహనీయుడని ఆయన కొనియాడారు. అల్లూరి ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పాండ్రంగి సమీపంలోని గోస్తని నదిపై వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో సంగీత్ మాధుర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు, జనసేన భీమిలి ఇన్‌చార్జి పంచకర్ల సందీప్, సర్పంచ్ పల్లి ఝాన్సీ, ఎంపీటీసీ సభ్యురాలు నారాయణమ్మ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.