
‘జర్నలిస్ట్‌ల పిల్లలకు స్కూల్ ఫీజులో రాయితీ’
మహారాణిపేట: జిల్లాలోని జర్నలిస్ట్‌లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారి పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. జాతీయ జర్నలిస్ట్‌ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, పలువురు జర్నలిస్ట్ నాయకులు మంగళవారం కలెక్టర్‌ను కలిశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో యోగాంధ్ర నమోదైన నేపథ్యంలో కలెక్టర్‌కు అభినందనలు తెలిపి, సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్ట్‌లకు గతేడాది అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారని, ఈ ఏడాది కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించేలా తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, ఇప్పటికే సంబంధిత విభాగం అధికారులకు ఆ బాధ్యత అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు. జర్నలిస్ట్‌ల పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ కల్పించాలని, ఇప్పటికే వినతిపత్రం అందించామని వివరించగా, ఫీజు రాయితీ కల్పించడానికి తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. రెండు రోజుల్లో జిల్లా విద్యా శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. జర్నలిస్ట్‌లు జి.శ్రీనివాసరావు, బ్రాడ్‌కాస్ట్ అసోసియేషన్ కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎస్ జగన్మోహన్, కార్యనిర్వాహక సభ్యుడు అరుణ్‌కుమార్, రమణమూర్తి, నగేష్‌బాబు పాల్గొన్నారు.