గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు

Jul 2 2025 5:02 AM | Updated on Jul 2 2025 5:02 AM

గిరి

గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు

● 32 కి.మీ.పరిధిలో వీధి దీపాలుసీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు ● 132 పాయింట్లలో తాగునీటి సదుపాయం ● స్నానఘట్టం వద్ద గజ ఈతగాళ్లు, హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటు ● కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ వెల్లడి

మహారాణిపేట: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్న సింహాచలం గిరి ప్రదక్షిణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్‌, రెవెన్యూ, దేవస్థానం, ఇతర శాఖల అధికారులతో ఆయన గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 9న తెల్లవారుజాము నుంచి 10వ తేదీ సాయంత్రం వరకు కొండదిగువ తొలిపావంచా వద్ద భక్తుల రద్దీని, ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీస్‌ బందోబస్తు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూలు, రద్దీ ప్ర దేశాల వద్ద తోపులాటలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

భక్తులకు సౌకర్యాలు, వైద్య సేవలు

లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున 32 కిలోమీటర్ల మేర 132 పాయింట్లలో తాగునీటి సౌకర్యం, 400 మరుగుదొడ్లు, పారిశుధ్యంతో పాటు రద్దీ ప్రదేశాల్లో లైటింగ్‌ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. అవసరమైన అంబులెన్సులు, 32 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి శిబిరం వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులతో పాటు ఒక వైద్యుడు, ఏఎన్‌ఎం లేదా ఆశ కార్యకర్తను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తులు ప్రదక్షిణ చేసే మార్గంలో, రద్దీ ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండాలని, అవసరమైన మేరకు జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఈపీడీసీఎల్‌ అధికారులను సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలను మూసివేయా లని ఎకై ్సజ్‌ శాఖ అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. సింహగిరిపై అగ్నిమాపక యంత్రం, ఫైర్‌ నియంత్రణ పరికరాలతో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్‌ తీగలు వేలాడకుండా చూసుకోవాలని, గిరి ప్రదక్షిణ జరిగే దారిలో వాహనాలు అడ్డదిడ్డంగా నిలపకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

యాప్‌తో సాంకేతిక సాయం

అత్యవసర సమయాల్లో ప్రత్యేక యాప్‌ ద్వారా సహాయం అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. అలాగే ట్రాఫిక్‌ నిర్వహణకు సంబంధించి ‘అస్త్రం’యాప్‌ ద్వారా సహాయం పొందవచ్చని సీపీ శంఖబ్రత బాగ్చి సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇవ్వాలని సీపీ ఆదేశించారు. పటిష్టమైన బారికేడింగ్‌ ఏర్పాటు చేయాలని, హనుమంతువాక, ఇసుకతోట జంక్షన్ల వద్ద తాత్కాలిక వంతెనలు నిర్మించాలని సీపీ సూచించారు. సమీక్షలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌, సింహాచలం ఈవో త్రినాథరావు, డీఆర్వో భవానీ శంకర్‌, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ రమణమూర్తి, భీమిలి ఆర్డీవో సంగీత్‌ మాథుర్‌, రెవెన్యూ, దేవస్థానం, జీవీఎంసీ, పోలీస్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ క్షేత్రస్థాయి పరిశీలన

సింహాచలం: గిరి ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌.. నగర సీపీ శంఖబ్రత బాగ్చి, జేసీ మయూర్‌ అశోక్‌, సింహాచలం ఈవో త్రినాథరావుతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గిరి ప్రదక్షిణ జరిగే అప్పుఘర్‌, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవదార, మురళీనగర్‌, ప్రహ్లాదపురం, కుమారి కల్యాణ మండపం మీదుగా సింహాచలంలోని తొలి పావంచా వరకు ఆయన సందర్శించి.. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. సింహాచలం తొలిపావంచా వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు1
1/1

గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement