
విశాఖపట్నం: నేను, నా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాం. సాయంత్రం టీ తాగి పిల్లలతో కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలో భారీ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా మా బోగీ కుదుపునకు గురైంది. బాంబు పేలిందేమోనని భయంతో వణికిపోయాం. బోగీ పక్కకు ఒరిగిపోయింది. అసలేం జరిగిందో మాకు అర్థం కాలేదు. పిల్లలు, నేను, నా భార్య.. తోటి ప్రయాణికులంతా చెల్లాచెదురైపోయాం. 40 నిమిషాలకు పైగా బోగీలోనే ఉండిపోయాం. మా పిల్లలు కాసేపు కనిపించలేదు. చనిపోయారేమోనన్న ఆలోచనతో కాళ్లు, చేతులూ వణికిపోయాయి.
నా భార్య నొప్పితో విలవిల్లాడుతోంది. పిల్లల కోసం అరిచాను. మా సీట్లకు రెండు సీట్ల దూరంలో వారు జారిపోయి ఉన్నారు. వారు లగేజీలపై పడటంతో ఎలాంటి గాయాలు కాలేదు. కొందరు ప్రయాణికులు అద్దాలు పగలగొట్టారు. ఈలోగా కొందరు గ్రామస్తులు వచ్చి సాయం చేశారు. ముందుగా పిల్లల్ని బయటకి పంపించాం.. నా భార్యని పైకి లాగారు. తర్వాత నేను బయటికి వచ్చాను. సాయం చేసేందుకు వచ్చిన వాళ్లు.. ఏం జరిగిందో చెప్పారు. ఈ ప్రమాదం నదిపైన జరిగి ఉంటే.. ఈరోజు ఇలా మాట్లాడే వాళ్లం కాదేమో.
కొంచెం ముందుకెళ్లి చూస్తే చాలామంది చనిపోయి ఉన్నారు. వాళ్లని చూసి నాకు ఏడుపు ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొందరు అధికారుల్ని, మంత్రుల్ని పంపించిందని అక్కడ చెప్పడంతో వాళ్ల వద్దకు వెళ్లాను. ట్రైన్‌లో వైజాగ్ వచ్చేశాం. సెవెన్‌హిల్స్ హాస్పిటల్‌లో నాకు, నా భార్యకు మెరుగైన వైద్యం అందుతోంది. రూపాయి ఖర్చు లేకుండా సీఎం వైఎస్ జగన్ మాకు వైద్యం చేయిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి మన రాష్ట్రానికి చెందిన వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
– లోకేష్, ప్రమాద బాధితుడు