అనంతగిరి: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాలు పనిచేయక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ బీజేపీ నేతలు బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సమస్య తమ దృష్టికి వచ్చిందని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వివరణ ఇచ్చిన వారు సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి మరో నలుగురు కార్యకర్తలు కలెక్టర్ దీపక్ తివారిని కలిశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏసీలు పనిచేయక రోగులు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో ఏసీలను బాగు చేస్తామని తెలిపారు. కలెక్టర్ వివరణతో సంతృప్తి చెందని బీజేపీ నేతలు.. గతంలో అనేక సార్లు అధికారులకు సమస్యలు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో దురుసుగా మాట్లాడారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమస్యలు చెప్పినా పట్టించుకోరా.. మీపై కూడా ఫిర్యాదు చేస్తాం.. చర్యలు తీసుకునేలా చూస్తాం అని కలెక్టర్‌ను హెచ్చరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం. కలెక్టర్ చాంబర్‌లోనే ఇదంతా జరిగినట్లు సమాచారం.
పోలీసుల రంగప్రవేశం
కలెక్టరేట్‌లో బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరును తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని వారిని స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. కొద్దిసేపు కలెక్టరేట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాలు పనిచేయడం లేదంటూ ఫిర్యాదు
వివరణ ఇచ్చినా సంతృప్తి చెందని నాయకులు
మాటామాటా పెరగడంతో ఉద్రిక్తత
కేసు నమోదు
నేతల అరెస్ట్, స్టేషన్‌కు తరలింపు


