బషీరాబాద్: రైతులకు అన్యాయం జరిగితే పదవి పోయినా వెనక్కి తగ్గేది లేదని నావంద్గీ సహకార సంఘం చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి స్పష్టం చేశారు. అన్నదాత సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే లక్ష్మీనారాయణపూర్ డీసీసీబీ ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. బుధవారం మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చొరవతో బషీరాబాద్, యాలాల మండలాల రైతులకు బ్యాంకు సేవలు విస్తృతం చేయాలని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో డీసీసీబీ బ్యాంకు ఏర్పాటు చేశారని చైర్మన్ తెలిపారు. అయితే బ్యాంకు మేనేజర్ మమత రైతులకు పంట రుణాల విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సొసైటీ ఖాతాలో నిధులు ఉన్నప్పటికీ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఇచ్చిన చెక్కును నిలిపివేశారని చైర్మన్ తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సొసైటీ రూ.88.34 లక్షల ఆదాయం సాధించిందని, ఆ నిధులతో రైతులకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నా బ్యాంకు నుంచి సహకారం అందడం లేదని అన్నారు. ఆరున్నరేళ్లలో రైతులకు రూ.9 కోట్ల వరకు పంట రుణాలు అందించామని, ఇప్పటివరకు రూ.3 కోట్ల రుణాలను రెన్యూవల్ చేయించామని తెలిపారు. పంటల పరిస్థితుల కారణంగా కొంతమంది రైతులు సకాలంలో రుణాలు చెల్లించలేకపోయారని, వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రికవరీ చేస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ మొత్తం బకాయిలు చెల్లించే వరకు కొత్త రుణాలు ఇవ్వకపోవడం, ఎరువులు, విత్తనాల కోసం చెల్లించిన డీడీలను రుణ బకాయిల కింద జమ చేయడం సరికాదని పాలకవర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న వాణిజ్య కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయాన్ని రైతుల సంక్షేమానికి వినియోగిస్తున్నామని తెలిపారు. మేనేజర్ ఇలాగే ఆటంకాలు కొనసాగిస్తే రైతులతో కలిసి బ్యాంకు ఎదుట ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో సీఈఓ వెంకటయ్య, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, అశోక్ చంద్ర గౌతమ్, రంగారెడ్డి, హన్మంత్‌రెడ్డి, తోట గోపాల్, పాపమ్మ తదితరులు పాల్గొన్నారు.
రుణాలు ఇస్తే అడ్డుకుంటారా?
ఉద్యోగుల జీతాలు ఆపడానికి మీరెవరు?
నావంద్గీ సొసైటీ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి
డీసీసీబీ మేనేజర్ తీరుపై పాలకవర్గం మండిపాటు


