రండి..మీట్‌ అవుదాం! | - | Sakshi
Sakshi News home page

రండి..మీట్‌ అవుదాం!

May 24 2026 11:22 AM | Updated on May 24 2026 11:22 AM

వ్యయం తక్కువ.. ఫలం ఎక్కువ

సాక్షి సిటీబ్యూరో: దేశంలో ఎం.ఐ.సి.ఇ (మీటింగ్స్‌, ఇన్సెంటివ్స్‌, కాన్ఫరెన్సులు, ఎగ్జిబిషన్‌) రంగం వేగంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ వ్యాపార సమావేశాలు, కార్పొరేట్‌ సమ్మిట్లు, సాంకేతిక ప్రదర్శనలు, వైద్య సదస్సులు నిర్వహించేందుకు దేశంలోని ప్రధాన నగరాల మధ్య పోటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీ ఆధిపత్యం కొనసాగించింది. ఆ తర్వాతి స్థానంలో బెంగళూరు నిలవగా అనూహ్య వేగంతో ఎదుగుతూ మన హైదరాబాద్‌ ప్రస్తుతం రెండవ స్థానాన్ని ఆక్రమించింది.

ఢిల్లీది సంప్రదాయ ఆధిక్యం

రాజకీయ, దౌత్య, పరిపాలనా కేంద్రంగా ఢిల్లీకి సహజంగానే అంతర్జాతీయ గుర్తింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విదేశీ రాయబార కార్యాలయాలు, భారీ కన్వెన్షన్‌ వేదికలు, ఐదు నక్షత్ర హోటళ్ల విస్తృత నెట్‌వర్క్‌ ఢిల్లీకి ప్రధాన బలం. ఇటీవల ప్రారంభమైన యశోభూమి వంటి ప్రపంచస్థాయి కన్వెన్షన్‌ సెంటర్లు ఢిల్లీ స్థాయిని మరింత పెంచాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో కనెక్టివిటీ, ఎన్‌సిఆర్‌ పరిధిలో విస్తరించిన వ్యాపార కేంద్రాలు కూడా పెద్ద ఈవెంట్ల నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థల సమావేశాల్లో ఢిల్లీ ఇప్పటికీ మొదటి ఎంపికే.

అనూహ్య వేగం.. నగరం ప్రత్యేకం

ఐటీ నగరంగా మాత్రమే గుర్తింపు పొందిన మన సిటీ..ఇప్పుడు అంతర్జాతీయ సమావేశాల కేంద్రంగానూ రూపాంతరం చెందుతోంది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) వంటి ఆధునిక వేదికలు నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఐటీ, ఫార్మా, బయోటెక్‌, డేటా సెంటర్‌, స్టార్టప్‌ రంగాల్లో అంచనాలకు మించిన వేగవంతమైన అభివృద్ధి వల్ల ప్రపంచస్థాయి కంపెనీలు భారీ సదస్సులు, సమావేశాలు, ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

కాన్ఫరెన్సుల క్యాపిటల్‌గా సిటీ

నం.1 స్థానం కోసం ఢిల్లీతో పోటీ

అంతర్జాతీయ స్థాయి వసతులతో అందరి దృష్టి ఇటే..

భారీ స్థాయి కాన్ఫరెన్స్‌ల నిర్వహణలో కీలక అంశం వ్యయం. ఈ విషయంలో హైదరాబాద్‌కు ఢిల్లీపై స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. దేశ రాజధాని నగరంతో పోలిస్తే నగరంలో హోటల్‌ వ్యయాలు తక్కువ. అలాగే వేదికల అద్దెలు వగైరాల వల్ల ఈవెంట్‌ నిర్వహణ ఖర్చులు తక్కువే. మరీ ముఖ్యమైన విషయం ట్రాఫిక్‌ జామ్స్‌కు సంబంధించి ఆ నగరంతో పోలిస్తే చాలా చాలా మెరుగు. ఇక విమానాశ్రయం నుంచి నగరానికి వేగవంతమైన కనెక్టివిటీ ఉంది. ఈ కారణాల వల్లే వల్ల భారీ కార్యక్రమాల నిర్వాహకులు నగరానికి ఓటేస్తున్నారు. ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రతినిధులు ‘సౌకర్యవంతమైన నగరం’గా హైదరాబాద్‌ను పేర్కొంటున్నారని ఈవెంట్‌ రంగ నిపుణులు రాజ్‌ కిషోర్‌ చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement