సమాఖ్య మహిళలు | - | Sakshi
Sakshi News home page

సమాఖ్య మహిళలు

May 21 2026 10:13 AM | Updated on May 21 2026 10:13 AM

గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026

బషీరాబాద్‌: మహిళా సమాఖ్య సభ్యులు బస్సు యజమానులు కానున్నారు. త్వరలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు బస్సులను అద్దెకిచ్చి తద్వారా లబ్ధి పొందనున్నారు. సెర్ప్‌ ద్వారా జిల్లాకు రూ.5.7 కోట్ల గ్రాంట్‌ మంజూరు కాగా.. సమాఖ్య సభ్యులు తమ వాటాగా రూ.1.14 కోట్లు చెల్లించి 19 బస్సులను కొనుగోలు చేశారు. ఈ నెల 25 నుంచి ఈ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రతి మండల సమాఖ్యకు ఒక్కొక్కటి చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. బస్సుల కొనుగోలుకు సెర్ప్‌ సంస్థలోని సీఐఎఫ్‌ నిధులను విడుదల చేసింది. జిల్లాలోని 19 మండల సమాఖ్యలకు రూ.5.7 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షలు వెచ్చించనున్నట్లు సమాచారం. సీఐఎఫ్‌(కమ్యూనిటీ ఇన్విస్టిమెంట్‌ ఫండ్‌) ద్వారా రూ.30 లక్షలు, సమాఖ్య సభ్యులు తమ వాటాగా రూ.6 లక్షల చొప్పున చెల్లించారు. కొనుగోలు చేసిన 19 బస్సులను ఆర్టీసీకి ఏడేళ్ల పాటు ఫైనాన్స్‌ చేస్తూ అప్పగించనున్నారు. మండల సమాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఈ ఏడేళ్లలో తిరిగి చెల్లిస్తాయి. ఒక్కో బస్సుకు ఆర్టీసీ ప్రతి నెలా మొదటి వారంలో ఈఎంఐ రూపంలో రూ.69,468 చెల్లించేందుకు సమాఖ్యల పేరున ఆర్టీఏలో హైపతికేషన్‌ పూర్తిచేశారు. ప్రతి నెలా చెల్లించే ఈ మొత్తం మండల సమాఖ్యకు చెందిన సీఐఎఫ్‌ ఖాతాలో జమవుతాయి. ఈ మొత్తాన్ని సభ్యుల అభ్యున్నతికి వినియోగిస్తారు. మంజూరైన 19 బస్సుల్లో ఆరు జిల్లా నుంచి మిగతా 13 బస్సులను హైదరాబాద్‌ డిపో 1, 2 నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు సెర్ప్‌ డీపీఎం నర్సింలు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి బస్సులు రోడ్డెక్కనున్నట్లు తెలిసింది.

ఆర్టీసీ సంస్థపై తగ్గనున్న ఒత్తిడి

ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొన్ని ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకొని నడిపిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణంతో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో అదనపు బస్సుల అవసరం ఏర్పడింది. మహిళా సంఘాల ద్వారా బస్సులు సమకూర్చడంతో ఆర్టీసీపై ఒత్తిడి తగ్గనుంది.

జిల్లాకు 19 బస్సుల కేటాయింపు

సెర్ప్‌ ద్వారా రూ.5.7 కోట్ల నిధులు

తమ వాటాగా రూ.1.14 కోట్లు చెల్లించిన సభ్యులు

25 నుంచి రోడ్డెక్కనున్న వాహనాలు

తాండూరులో దాల్‌మిల్‌

తాండూరు రూరల్‌: డ్వాక్రా సంఘాల ఆర్థిక బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాండూరులో దాల్‌మిల్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బుధవారం జాతీయ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ అధికారులు రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ సత్యజేంద్ర, ఎంబీకే రాజు, సెర్ప్‌ మార్కెటింగ్‌ అధికారులు రాములు, ఇందు బ్రాహ్మణి, దినేష్‌ తదితరులు తాండూరులో పర్యటించారు. ముందుగా మహిళా సమాఖ్య కార్యాలయంలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రసూల్‌పూర్‌ వద్ద గల వ్యవసాయ పరిశోధన సంస్థకు వెళ్లి అక్కడి దాల్‌, ఆయిల్‌ మిల్లులను పరిశీలించారు. సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సుధారాణితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆ తర్వాత పట్టణంలోని డీసీఎంఎస్‌లో దాల్‌మిల్లును సందర్శించారు. మేనేజర్‌ సలాం పాషాతో మాట్లాడారు. అంతారం మార్గంలోని గోదాంను చూశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సెర్ప్‌ ఆధ్వర్యంలో రూ.కోటితో తాండూరులో దాల్‌మిల్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో పరిశ్రమ కొనసాగుతుందన్నారు. ఇక్కడ తయారయ్యే కంది పప్పును స్థానిక సూపర్‌ మార్కెట్లతో పాటు ప్యాకింగ్‌ చేసి వివిధ పట్టణాలకు తరలిస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కూడా చేయనున్నట్లు వివరించారు. దేశంలోనే తాండూరు కంది పప్పునకు మంచిపేరు డిమాండ్‌ ఉన్నందున ఇక్కడ దాల్‌మిల్లు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎంలు కొమరయ్య, శేఖర్‌, ఏపీఎం బాలయ్య, సీఈఓ ప్రశాంత్‌, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానకి, మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement