మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే టీఆర్‌ఆర్
పరిగి: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి భూ సేకరణ పనులను త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి కోరారు. బుధవారం నగరంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తయితే పరిగి, తాండూరు, వికారాబాద్ ప్రాంతాల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. సాగు నీటికి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారం రోజుల్లో భూ సేకరణ పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బొంరాస్‌పేట: మండల కేంద్రంలోని దివ్యాంగ చిన్నారులకు ఉచితంగా పరికరాలు అందజేశారు. మండలంలోని 15మంది చిన్నారులకు అవసరమైన పరికరాలు డీఈఓ రేణుకాదేవి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐ కోఆర్డినేటర్ రజిని కుమారి, ఐఆర్‌పీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: యూత్ అండ్ స్పోర్ట్స్ వారోత్సవాల్లో భాగంగా బుధవారం వికారాబాద్‌లోని ఏటీసీలో విద్యార్థులకు యూత్ పార్లమెంట్, పెయింటింగ్ విభాగంలో పోటీలు నిర్వహించారు. వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రీడల వి భాగం జిల్లా అధికారి అబ్దుల్ సత్తార్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జీపీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రావు
అనంతగిరి: గ్రామ పాలన అధికారులు ఐకమత్యంగా ఉండి హక్కుల సాధనకు పోరాటం చేద్దామని జీపీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్‌లో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో క్షేత్రస్థాయిలో పనిచేసేది జీపీఓలేనని పేర్కొన్నారు. సమస్యలపై నిరంతరం పోరాడుతమని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయకుమార్ చంద్రశేఖర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు కావలి వెంకటయ్య, వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు టీ గోపాల్, ప్రధాన కార్యదర్శి మలిగేరి రాజు, అసోసియేట్ అధ్యక్షుడు మొగులప్ప, మహిళా విభాగం అధ్యక్షురాలు సంధ్యారాణి, కోశాధికారి శివ, సలహాదారు రాంచంద్రయ్య, ఉపాధ్యక్షురాలు మమత, వికారాబాద్, తాండూరు డివిజన్ల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు పాల్గొన్నారు.


