పరిగి: రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం విత్తన వారోత్సవాలు నిర్వహిస్తోందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త స్వర్ణలత అన్నారు. బుధవారం మండలంలోని నస్కల్ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంట సాగులో విత్తన ఎంపిక ఎంతో కీలకమన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. నానో యూరియా, నానో డీఏపీ వాడాలన్నారు. నేలను బట్టి పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. మోతాదుకు మించి రసాయనాలు వాడితే భూ సారం దెబ్బతింటుందన్నారు. ఈ నెల 23 నుంచి విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికార రజిత, ఏఈఓ కావ్య తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికే విత్తన వారోత్సవాలు
శాస్త్రవేత్త స్వర్ణలత


