నవాబుపేట: రైతులు సాగులో రసాయనిక ఎరువులు తగ్గించి, సస్య రక్షణ చర్యల చేపడితే మంచి లాభాలు పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వాణిశ్రీ, పద్మజలు అన్నారు. మండల పరిధి గంగ్యాడలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. రైతులకు సూచనలు చేశారు. మండల వ్యవసాయాధికారి జ్యోతి, సర్పంచ్ మల్లేశం, ఏఈఓ రమాదేవి, రైతులు పాల్గొన్నారు.
పాఠశాలలకు నోట్ పుస్తకాలు
ధారూరు: మండల పరిధి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు నోట్ పుస్తకాలు అందాయి. ఎంఆర్‌సీ కార్యాలయం నుంచి బుధవారం పంపిణీ చేశామని ఎంఈఓ చెన్నయ్య తెలిపారు. 2026– 27 సంవత్సరానికి విద్యాశాఖ నుంచి ఈ పుస్తకాలు ఎంఆర్‌సీకీ చేరాయని పేర్కొన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం అనంతరం ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేస్తారని వివరించారు.
రైతులకు ఇబ్బంది కలగొద్దు
బషీరాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సొసైటీ మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శంకరప్పతో కలిసి దామర్‌చెడ్‌లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం చివరి గింజవరకుకొంటుందన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో సాఫీగా ధాన్యం సేకరణ జరుగుతుందని తెలిపారు. ఇక్కడి మిల్లులతో పాటు కొత్తగా సంగారెడ్డి జిల్లాలోని మిల్లుకు ధాన్యం తరలించేందుకు ఎమ్మెల్యే చొరవ చూపారని చెప్పారు. వర్షాలకు ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, నాయకులు రాజేందర్‌రెడ్డి, మల్కన్‌గిరి బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన
వేసవి శిక్షణ క్యాంపు
ఇబ్రహీంపట్నం: జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినోభానగర్‌లోని సాధన కుటీర్‌లో ప్రభుత్వ బడుల నుంచి ఎంపిక చేసిన 85 మంది విద్యార్థులకు 25 రోజుల పాటు ఇచ్చిన క్రీడా శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ మెంబర్ విజయభారతి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సహజ సిద్ధమైన శారీరక సామర్థ్యం, పట్టుదల, కష్టపడేతత్వం గల విద్యార్థులు చాలా మంది ఉన్నారన్నారు. సరైన గుర్తింపు, శిక్షణ, పోషకాహారం, మార్గదర్శకత్వం లేక వారి ప్రతిభ మధ్యలోనే కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఒకటిగా జీఎస్‌ఎఫ్ సాధన నిలిచిందన్నారు. రాష్ట్ర తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి సతీష్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎంపికై న విద్యార్థులకు ఆటల్లోనే కాకుండా క్రమశిక్షణ, సమయపాలన, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు అందించాలన్నారు. కార్యక్రమంలో జీఎస్‌ఎఫ్ ఫౌండర్ సదా వెంకట్‌రెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్ రాజేందర్‌రెడ్డి, సామాజిక కార్యకర్త సత్యం, జీఎస్‌ఎఫ్ సాద్రి ఇన్‌చార్జి ప్రమోద, స్పోర్ట్స్ వింగ్ ఇన్‌చార్జి చంద్రా తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


