తాండూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 17 నెలల చిన్నారి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. గత ఆదివారం తెల్లవారు జామున బెల్కటూర్ శివారులోని ఓ పెట్రోల్ పంపు వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఆదానీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు మహేష్‌తో పాటు అతని కూతురు వేదశ్రీ (17 నెలలు), డ్రైవర్ నారాయణ గాయపడ్డారు. వీరిని తాండూరులోని ఆస్పత్రికి తరలించగా, వేదశ్రీని హైదరాబాద్‌కు రిఫర్ చేయగా బుధవారం చనిపోయింది. మహేష్ స్వస్థలం ఏపీలోని కడప జిల్లా కాగా, ఒక్కగానొక్క పాప మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అప్పుల బాధతో
వ్యక్తి ఆత్మహత్య
అనంతగిరి: వికారాబాద్ పట్టణం ఆలంపల్లికి చెందిన డాకి వెంకటేశం(33) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్ సీఐ రఘుకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆలంపల్లికి చెందిన వెంకటేశం వ్యవసాయంతో పాటు ప్రైవేట్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. మృతుని తల్లిదండ్రులు, భార్య పొలం పని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి విగతాజీవిలా ఉన్నాడు. వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అప్పుల బాధతోనే తన కొడుకు చనిపోయినట్లు తండ్రి తెలిపాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.
ఉరి వేసుకొని వలస కూలీ ఆత్మహత్య
కొందుర్గు: చెట్టుకు ఉరి వేసుకొని ఓ వలస కూలీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొందుర్గులో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కాశీమండి(35) తన మిత్రులతో కలిసి కొన్ని రోజుల క్రితం కొందుర్గుకు వలస వచ్చాడు. శివారులో ఉన్న ధన లక్ష్మీ ప్యాకింగ్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఈనెల 19న ఆయన చిన్న ఎల్కిచర్ల గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి మిత్రుడు అదాన్ ముర్ము ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు. కాశీమండి తాగిన మైకంలో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


