● ఇసుక దొరకక ఇబ్బంది పడుతున్నాం
● చెంచులంటే అంతా చిన్నచూపా..
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట
ఆందోళన
తాండూరు రూరల్: ‘నిరుపేదలమని ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు. కానీ నిర్మించుకోవడానికి ఇసుక దొరకడం లేదు. ఇళ్లు ఎలా కట్టుకోవాలి? చెంచుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. సమస్య గురించి చెబితే పట్టించుకోవడం లేదు. మేమంటే అంత చిన్నచూపా’ అని చెంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక కొరత తీర్చాలని కోరుతూ.. పెద్దేముల్ మండలం చైతన్యనగర్ చెంచులు బుధవారం తహసీల్దార్ వెంకట్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమకు 176 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే మనోహార్‌రెడ్డి మూడు నెలల క్రితం భూమిపూజ చేయగా.. ఇసుక కొరత వలన పనులు జరగడం లేదని చెప్పారు. మండల పరిధి రేగొండి శివారు వాగు నుంచి ఇసుక పర్మిషన్ ఇచ్చారన్నారు. కానీ ఇసుక కోసం అక్కడి వెళ్లగా యాలాల మండలం అడాల్‌పూర్ గ్రామస్తులు అడ్డుకుంటున్నారని వివరించారు. కలెక్టర్ స్పందించి ఇళ్లకు ఇసుక అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందులో శ్రీనివాస్, వెంకటయ్య, లాలయ్య, శ్రీనివాస్, కిరణ్, గోపి, రాములు, వెంకటయ్యలు ఉన్నారు.


