కొత్తూరు: విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దని మందలించడంతో ఓ కార్మికుడు మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రంగాపూర్‌లో నివాసం ఉంటున్న కిశోర్(24) నాలుగేళ్ల నుంచి కొత్తూరు పట్టణంలో ఉన్న నాట్కోఫార్మాలో పనిచేస్తున్నాడు. కాగా పరిశ్రమలో ఓ హెచ్‌ఆర్ మేనేజర్ తనను తిట్టి కొన్ని రోజుల పాటు విధులకు రాకుండా చేశాడని మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం పరిశ్రమకు వెళ్లకుండా ఇంటి సమీపంలోని మెట్రోసిటీ వెంచర్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. అనంతరం న్యాయం చేయాలని కోరుతూ పరిశ్రమ గేటు ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ధర్నా చేపట్టారు. ఈ విషయమై పరిశ్రమ హెచ్‌ఆర్‌ను వివరణ కోరగా మృతుడు గత నెల రోజుల క్రితం విధుల్లో భాగంగా నిద్రించడంతో అలా చేస్తే జరిగే ప్రమాదాలపై కొన్ని రోజుల పాటు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం తిరిగి విధులకు హాజరవుతున్నట్లు వివరించారు. అంతేతప్ప కార్మికుడిని కావాలని తిట్టడం, అవమానించడం చేయలేదన్నారు. అనంతరం పరిశ్రమ ప్రతినిధులతో స్థానికులు, కుటుంబ సభ్యులు చర్చించడంతో న్యాయం చేస్తామని హామీ ఇవ్వగాఽ ధర్నా విరమించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
న్యాయం చేయాలని పరిశ్రమ గేటు ఎదుట ధర్నా


