దోమ: నాలుగు రోజులుగా నీరు రాక ఇబ్బంది పడుతున్నామని మండల పరిధి బట్లచందారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా కాగా.. పెద్దసఖ్యలో గుమికూడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఎండలో నడుచుకుంటూ పొలాల నుంచి బిందెలతో నీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు. మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడమే కాకుండా, ఉన్న బోర్లు పనిచేయకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు.ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా.. సరిపోవడం లేదన్నారు. విషయం అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని ఆరోపించారు. సంబంధిత జిల్లా అధికారులు స్పందించి, తాగు నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


