● అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
● ‘కాటన్ మరిచి.. కుట్లు వేసి’న ఘటనపై ఆరా
తాండూరు టౌన్: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. శనివారం ఆయన తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని (ఎంసీహెచ్) తనిఖీ చేశారు. ఇటీవల ఎంసీహెచ్‌లో ఓ బాలింతకు ఎపిసియోటమీ చేసి కాటన్ లోపల మరిచిపోయి కుట్లు వేయగా, ఆమె తీవ్ర అనారోగ్యంపాలయింది. ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ అనిల్, సివిల్ సర్జన్ డాక్టర్ సునీతను అడిగి వివరాలు ఆరా తీశారు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. పలు విభాగాల హాజరు రిజిస్టర్లు, వివిధ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలింత ఘటనపై ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్‌కుమార్, ఆర్‌ఎంఓ డాక్టర్ అనిల్, సివిల్ సర్జన్ సునీత తదితరులతో కలిసి సోమవారం కమిటీ వేసి, ఘటనపై విచారణ చేపడతామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆసుపత్రి పైకప్పు మరమ్మతు కోసం ప్రతిపాదనలు పంపాలని, ఈ వేసవిలోనే పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఆయన వెంట ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శరత్, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రతిభను వెలికితీయాలి
అనంతగిరి: విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన వికారాబాద్ డైట్ కళాశాలలోని నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన హస్తకళా ప్రదర్శనను ప్రారంభించి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. ఉత్తమ ఎగ్జిబిట్స్ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, వికారాబాద్ ఎంఈఓ బాబుసింగ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్, హెచ్‌ఎం యాదయ్య, డీఈఓ కార్యాలయ సిబ్బంది, వికారాబాద్ బాల భవన్ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


