తాండూరు రూరల్: డ్వాక్రా మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెండర్ రీసోర్స్ సెంటర్(జీఆర్‌సీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు సెర్ప్ ప్రోగ్రాం మేనేజర్ లింగయ్యగౌడ్ తెలిపారు. శనివారం ఆయన మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం జిల్లాలోని తాండూరు మహిళా సమాఖ్య కార్యాలయానికి జెండర్ రీసోర్స్ సెంటర్ మంజూరు చేసిందన్నారు. డ్వాక్రా సంఘంలోని మహిళల చట్టపరమైన సమస్యల పరిష్కారమే జీఆర్‌సీ ఉద్దేశమన్నారు. గ్రామస్థాయి, మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి వారికి డీఆర్‌డీఏ నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. సంఘంలోని మహిళలను భర్త, అత్త, మామాలు వేధిస్తే జెండర్ రీసోర్స్ సెంటర్‌లో ఫిర్యాదులు చేయవచ్చన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, మూఢ నమ్మకాలు, మానవ అక్రమ రవాణాలపై ఫిర్యాదులు స్వీకరిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం నర్సింలు, ఏపీఎం కిష్టప్ప, బాలయ్య, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, సీసీలు పాల్గొన్నారు.
సెర్ప్ ప్రోగ్రాం మేనేజర్ లింగయ్యగౌడ్


