● కలెక్టర్ దీపక్ తివారి
● కడా కార్యాలయంలో విద్యా వారోత్సవాలు
కొడంగల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిక నిధులు ఇస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ ఉషశ్రీ, ఎంఈఓ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భాగస్వాములు కండి
అనంతగిరి: ఆధునిక విద్యా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వికారాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య జ్యోతి ప్రజల్వన చేశారు. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, డీఈఓ రేణుకాదేవి, ఆయా మండలాల విద్యాధికారులు తదితరలు పాల్గొన్నారు.
నివేదికలు సమర్పించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రత్యేక అధికారులు రోజు సందర్శించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ స్నేహ మెహ్రతో కలిసి వరి ధాన్యం, మొక్కజొన్న, జొన్న కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లపురోగతి, ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా, పౌర సరఫరాల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మే చివరి నాటికి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కే వెంకటాచారి, జిల్లా పౌర సంబంధాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, జిల్లా సహకార అధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణలో జాప్యం వద్దు
బొంరాస్‌పేట: రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. బుధవారం బొంరాస్‌పేట, నాగిరెడ్డిపల్లిలోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హమాలీల సమస్య ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎంసీఎస్ మురళీకృష్ణ, డీఎస్‌ఓ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
మండల టాపర్‌కు సన్మానం
దుద్యాల్: పదో తరగతి ఫలితాల్లో 557 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచిన మౌనికను కలెక్టర్ దీపక్ తివారి సన్మానించారు. బుధవారం కొడంగల్‌లోని కడా కార్యాలయంలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, దుద్యాల్ సర్పంచ్ సంగీత వాణి తదితరులు పాల్గొన్నారు.


