అనంతగిరి: బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమెహ్ర ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవులను వధించకుండా చర్యలు చేపట్టాలన్నారు. పశువుల అక్రమ రవాణా నేరమన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, పశు సంవర్ధక శాఖ అధికారి సదానందం, పరిగి, కొడంగల్, తాండూరు, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ తదితర అంశాలపై నగరం నుంచి డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలోజరుపుకోవాలని కోరారు.
ప్రత్యేక నిఘా: ఎస్పీ
తాండూరు టౌన్: పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని చెక్‌పోస్టుల్లో తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. బుధవారం మండలంలోని అంతారం చెక్‌పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బక్రీదు పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
పశువులను తరలిస్తే చర్యలు
ధారూరు: అనుమతి, సరైన పత్రాలు లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని చెక్‌పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా పశువులను అక్రమ రవాణా చేస్తుంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ధారూరు సీఐ రఘురామ్, ఎస్‌ఐ రాఘవేందర్ పాల్గొన్నారు.
కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమెహ్ర


