లక్ష బోర్లకు ప్రాణం పోసిన భగీరథుడు | - | Sakshi
Sakshi News home page

లక్ష బోర్లకు ప్రాణం పోసిన భగీరథుడు

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

300 ట్యాంకులు పోయించుకున్నాం

భూగర్భ జలాల రక్షణకు బోర్లు వేయించనని ప్రమాణం

‘సాక్షి’తో హైడ్రో జియాలజిస్ట్‌ డాక్టర్‌ దేవరాజరెడ్డి ఎన్‌.జె

శంకర్‌పల్లి: ఆయన భూగర్భ జల శాస్త్రవేత్త. ఇప్పటికే ఎండిపోయిన దాదాపు లక్ష బోర్లను రీచార్జ్‌ చేసి ప్రాణం పోశారు. రూ.లక్షలు సంపాదించే అవకాశాలను వదిలి జల సంరక్షణకు 28 ఏళ్లుగా నడుం బిగించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, సోషల్‌ మీడియా ద్వారా భూగర్భ జలవనరులను కాపాడే మెళకువలను విరివిగా తెలియజేస్తున్నారు. పదేళ్ల క్రితం శంకర్‌పల్లి మండలం మోకిలలోని సార్క్‌–2 వెంచర్‌లో ఆయన చేసిన కృషి కారణంగా ఇప్పటికీ నీటి ఎద్దడి తలెత్తకుండా కేవలం రెండు బోర్ల ద్వారానే నీటిని సంమృద్ధిగా వినియోగించుకుంటున్నారు. ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

గ్రౌండ్‌ వాటర్‌ స్పెషలిస్ట్‌

కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్‌ దేవరాజ రెడ్డి ఎన్‌.జె 1987లో మైసూరు వర్సిటీ నుంచి భూగర్భ జల శాస్త్రవేత్తగా పట్టా పొందారు. నాటి నుంచి దాదాపు 11 ఏళ్ల పాటు మైసూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి లభ్యత ఆధారంగా బోర్లను వేయించే వారు. క్రమంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంపై చలించిన ఆయన 1998లో వృత్తిని వదిలి బోర్లను వేయించనని ప్రమాణం చేశాడు. సుమారు ఐదేళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కాపాడాలని కోరుతూ అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజల నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం పలు కమిటీల్లో చోటు కల్పించడంతో కర్ణాటకలో గ్రౌండ్‌ వాటర్‌ స్పెషలిస్ట్‌గా పేరు వచ్చింది. 2020నుంచి మూడేళ్ల పాటు కర్ణాటక ప్లానింగ్‌ కమిషన్‌ బోర్డు సభ్యుడిగా విధులు నిర్వర్తించారు.

జియో రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ సెంటర్‌

భూగర్భ జల వనరులను కాపాడాలని కోరుతూ ఆయన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన కృషిని గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అవార్డులను ప్రదానం చేశాయి. కన్నడలో నవ కర్ణాటక పబ్లికేషన్స్‌ నుంచి 15 ఎడిషన్స్‌, తెలుగులో విశాలాంధ్ర పబ్లికేషన్స్‌ నుంచి ఐదు ఎడిషన్స్‌ పుస్తకాలు విడుదలయ్యాయి. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2002లో బళ్లారి సమీపంలో చిత్రదుర్గలో తాను చైర్మన్‌గా ఉండి ఎనిమి మంది సభ్యులతో జియో రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

భవిష్యత్‌లలో తాగునీటికి ఇబ్బంది

1965లో డెన్మార్క్‌ సాంకేతిక ఆధారంగా భారతదేశంలో బోర్లు వేయడం ప్రారంభించారు. కేవలం 25 మీటర్లు లోతు మాత్రమే వేయాలని సూచించారు. ప్రభుత్వం గ్రీన్‌ రెవల్యూషన్‌ పేరుతో బోర్లకు సబ్సిడీ ఇచ్చి పెద్ద ఎత్తున బోర్లు వేయించింది. తర్వాత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో 25 మీటర్ల లోతు కాస్తా.. వేయి మీటర్లకు వెళ్లింది. దీంతో దేశంలో 60 ఏళ్లలో దాదాపు 6 కోట్లకు పైగానే బోర్లు ఉన్నాయని, వీటి ద్వారా అవసరానికి మించి నీటిని తోడడంతో దాదాపు 80 శాతం భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వేసిన బోర్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఎండిపోయిన బోర్లను రీచార్జి పద్ధతిలో వినియోగంలోకి తీసుకురావచ్చని సూచిసున్నారు. ప్రస్తుతం ఉన్న 20శాతం భూగర్భ జలాలు సైతం రూరల్‌, అటవీ ప్రాంతాల్లోనే ఉన్నాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తాగడానికి నీరు లభించడం కష్టమని హెచ్చరించారు.

సూచనలు

● వర్షపు నీటిని ఒడిసి పట్టాలి.

● పొలంలో ఓ చివరన పెద్ద గుంతను తవ్వి వర్షపు నీరు నిలిచేలా సిద్ధం చేస్తే భూగర్భజలాలు పెరుగుతాయి.

● ఇళ్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు, వెంచర్లలో ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలి.

● ఇంకుడు గుంత నిర్మాణంలో మొదట 40 ఎంఎం కాంక్రీటు తర్వాత 20ఎంఎం వేసిన తర్వాత ఫిల్టర్‌ని అమర్చాలి. తర్వాత బొగ్గు, చివరల్లో 6 ఎంఎం కాంక్రీటును వేయాలని. దీంతో నీరు భూమిలోపలికి వెళ్తుందన్నారు.

మోకిలలో సార్క్‌ విల్లాలను నిర్మించిన బిల్డర్‌ సరైన సదుపాయాలు కల్పించలేదు. 2016లో ఉన్న రెండు బోర్లు ఫెయిల్‌ అయ్యాయి. దీంతో నెల రోజుల్లో 300 వాటర్‌ ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేశాం. తర్వాత యూట్యూబ్‌లో డాక్టర్‌ దేవరాజ రెడ్డి అవగాహన కార్యక్రమాలను చూసి ఆయన్ను పిలుచుకున్నాం. కేవలం రూ.4 లక్షల ఖర్చుతో ఒక కుంటను ఏర్పాటు చేయించి, ఎండిపోయిన రెండు బోర్లను రీచార్జ్‌ చేశారు. పదేళ్లుగా సంవృద్ధిగా నీరు లభిస్తోంది. ఇప్పుడు సార్క్‌–2 వెంచర్‌ నుంచి ఇతరులకు నీటి సాయం చేశామని గర్వంగా చెప్పుకుంటాం.

– భాస్కర్‌, సార్క్‌–2 అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు

సంవత్సరం అవార్డు

2008 కృషిపండిట్‌

2011 ఎన్విరాన్‌మెంటల్‌

2016 రాజ్యోత్సవ,

అసమాన్య కన్నడి

2018 వాటర్‌ రిసోర్సెస్‌

(కేంద్ర ప్రభుత్వం)

Advertisement
 
Advertisement
Advertisement