రంగారెడ్డి డీపీహెచ్ మమత
ఇబ్రహీంపట్నం రూరల్: పిల్లలకు క్రమం తప్పకుండా టీకా వేయించాలని జిల్లా డీపీహెచ్(డైరెక్టర్‌ఆఫ్ పబ్లిక్ హెల్త్) ఎన్.మమత సూచించారు. బుధవారం ఆమె ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని ఎంపీపటేల్‌గూడ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14–15 ఏళ్ల లోపు ఆడపిల్లలందరూ హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని సూచించారు. ప్రతీ బుధవారం చిన్నపిల్లలకు అన్ని రకాల వ్యాధులకు సంబంధించి టీకా ఇస్తారని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ అజయ్‌కుమార్, ఇబ్రహీంపట్నం హెచ్‌ఈ బ్రిజిత సిస్టర్ తిరుమలమ్మ, అనిత, భాగ్య, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కడ్తాల్: మండల కేంద్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఏసీపీ కార్యాలయం, వాహనాల రద్ధీ నియంత్రణకు ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు. బుధవారం ఆయన నగరంలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీగా నియమితులైన సీవీఆనంద్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజా అవసరాలపై చర్చించి వినతిపత్రం అందజేశారు. ఫ్యూచర్‌సిటీలో భాగంగా కడ్తాల్ మండలం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి కూడ ఉండటంతో వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ఏసీపీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.ఈ మేరకు డీజీపీ సానుకూలంగా స్పందించారని, సంబందిత అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారని తెలిపారు.
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శివకుమార్
తుర్కయంజాల్: నీట్ పరీక్ష నిర్వహణలో వరుసగా విఫలమవుతోన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి పి.శివకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం తుర్కయంజాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పరీక్షా అని కేంద్రం తీసుకువచ్చిన ఈ విధానం వల్ల ఎంతో మంది విద్యార్ధులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్–2026 లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: భారత ప్రభుత్వం చేపట్టిన జనగణన–2027లో భాగంగా సోమవారం ప్రారంభమైన ఇళ్ల జాబితా, గణన ప్రక్రియలో అధికారులు బాధ్యతగా పాల్గొనాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. వచ్చే నెల 9వ తేదీ వరకు మీ ఇంటి వద్దకు వచ్చే నమోదు అధికారికి అన్ని వివరాలు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. స్వీయ గణన నమోదు చేసుకున్నవారు ఎస్‌ఈఐడీ నంబర్ చూపితే సరిపోతుందన్నారు. సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇళ్ల గణనకు వచ్చే అధికారికి సరైన సమాచారాన్ని అందించి సహకరించాలని కోరారు.
సూదిని రాంరెడ్డికి కసిరెడ్డి అభినందనలు
మాడ్గుల: పంచాయితీ రాజ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సూదిని రాంరెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రమంజిల్‌లోని తన కార్యాలయానికి వెళ్లి పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో అభినందించారు. వీరిలో సూదిని లక్ష్మారెడ్డి, సూదిని అరవింద్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాయితి సాయిరెడ్డి, రవికాంత్, యాదయ్య, నర్సింహ తదితరులు ఉన్నారు.


