పార్క్‌ చేసిన వాహనాల నుంచి డీజిల్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

పార్క్‌ చేసిన వాహనాల నుంచి డీజిల్‌ చోరీ

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

ఇద్దరు ఆటోడ్రైవర్లకు రిమాండ్‌

కందుకూరు: పార్క్‌ చేసిన వాహనాల నుంచి రాత్రి వేళ డీజిల్‌ చోరీ చేస్తున్న దొంగలను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మహేశ్వరం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం మండల పరిధిలోని దిల్వార్‌గూడ(జండాగూడ)లో రాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు పార్క్‌ చేసిన వాహనాల నుంచి డీజిల్‌ దొంగిలిస్తున్నారు. ఓ ఆర్టీసీ బస్సు నుంచి 110 లీటర్లు, డీసీఎం నుంచి 30 లీటర్లు, టిప్పర్‌ నుంచి 300 లీటర్లు మొత్తంగా రెండు రోజుల వ్యవధిలో 440 లీటర్లు దోచినట్లు వాహనాల యజమానులు, డ్రైవర్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వి.ప్రసాద్‌, క్రైం బృందం శివారజ్‌, ప్రవీణ్‌ దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలించారు. ఓ బ్లూ స్విఫ్ట్‌ కారులో రాత్రి సమయంలో ఇద్దరు వచ్చి డీజిల్‌ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ ఫుటేజీ ఆధారంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలం ఐలాపూర్‌ తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ సభావత్‌ రమేశ్‌(30), హైదరాబాద్‌ మియాపూర్‌లో ఉండే నడిగడ్డతండాకు చెందిన ఆటో డ్రైవర్‌ ముడావత్‌ గణేశ్‌(18)గా గుర్తించారు. వారిని బుధవారం అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకొన్నారు. దీంతో వారి వద్ద 330 లీటర్ల డీజిల్‌తో పాటు స్విఫ్ట్‌ కారు, డీజిల్‌ అమ్మగా వచ్చిన సొమ్ము రూ.19,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement