అక్రమాలకు లేటరైట్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు లేటరైట్‌

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

జిల్లాలో యథేచ్ఛగా తవ్వకాలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: సిమెంట్‌ తయారీలో ఉపయోగించే లేటరైట్‌(క్యాల్షియం, అల్యూమినియం ఆకై ్సడ్‌) ఖనిజం జిల్లా సరిహద్దులు దాటుతోంది. భూమి నుంచి వెలికితీసిన ముడిసరుకును కర్మాగారాల్లో ముక్కలు చేసి, 900 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. లైమ్‌స్టోన్‌, జిప్సం ఇతర ముడిపదార్థాల మిశ్రమాన్ని కలిపి కావాల్సిన గ్రేడింగ్‌లో సిమెంట్‌ తయారు చేస్తుంటారు. లేటరైట్‌ వినియోగం ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. జిల్లాలోని పెద్దేముల్‌ మండలం తట్టేపల్లి, ఓంలానాయక్‌ తండా, పాషాపూర్‌, రాంసింగ్‌ తండాలు.. బంట్వారం మండలంలోని బోపునారం శివారు.. వికారాబాద్‌, పూడూరు, మోమిన్‌పేట్‌, నవాబ్‌పేట మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో వందల ఎకరాల్లో ఈ లేటరైట్‌ ఖనిజం విస్తరించి ఉంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో 38 మైన్స్‌ ఉండగా, కొత్తగా మరో తొమ్మిది గుర్తించారు. నిజానికి హెక్టార్‌ పట్టా భూమిలో ఈ లేటరైట్‌ ఖనిజాన్ని తవ్వాలంటే రూ.8 లక్షలు డెడ్‌రెంట్‌ చెల్లించాల్సి ఉంది. పర్యావరణం, గనులు, రెవెన్యూశాఖల అనుమతి తప్పని సరి. తవ్వకాలు చేపట్టే భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాల్సి ఉంది. ఇందుకు రూ.లక్షల్లో ప్రభుత్వానికి చెల్లించాలి. అనుమతి పొందిన ప్రాంతంలోనే తవ్వకాలు జరపాలి. ప్రతి టన్నుకు రూ.135 చొప్పున రాయల్టీ కట్టాలి. కానీ మెజార్టీ లీజు దారులు రాయల్టీ ఎగొట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. రోజుకు సగటున ఆరువేల టన్నుల అక్రమ తవ్వకాలతో ప్రభుత్వం రూ.8.10 లక్షల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. కేవలం ఈ లేటరైట్‌ ఖనిజం అక్రమ రవాణాతోనే ప్రభుత్వానికి నెలా రూ.2.43 కోట్ల ఆదాయం రాకుండా పోతోంది.

పెద్దేముల్‌ మండలం ఓంలా నాయక్‌ తండాలోని అసైన్‌ భూమిలో లేటరైట్‌ అక్రమ తవ్వకాలు

2022 – 25 వరకు లేటరైట్‌ తవ్వకాలు ఇలా.. (మెట్రిక్‌ టన్నుల్లో..)

సంవత్సరం తవ్వకాలు

2022–23 26,25,493

2023–24 3,06,459

2024–25 28,90,709

2022 – 25 వరకు లైమ్‌స్టోన్‌ తవ్వకాలు ఇలా.. (మెట్రిక్‌ టన్నుల్లో..)

సంవత్సరం తవ్వకాలు

2022–23 49,415

2023–24 33,870

2024–25 33,150

సరిహద్దులు దాటుతున్న ఖనిజం

పట్టించుకోని మైనింగ్‌ విభాగం

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

లైమ్‌స్టోన్‌ మైన్స్‌..

సిమెంట్‌ తయారీలో వాడే లైమ్‌స్టోన్‌(క్యాల్షియం కార్బొనేట్‌) మైన్స్‌ జిల్లాలోని తాండూరు, బషీరాబాద్‌, కొడంగల్‌ పరిసరాల్లో 49 వరకు ఉన్నాయి. వీటిలో 24 మైన్స్‌ వర్కింగ్‌లో ఉన్నాయి. కొత్తగా మరో 17 ప్రాంతాల్లో మైన్స్‌ను గుర్తించారు. వీటిలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేలింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న తవ్వకాలకు.. ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయానికి అసలు పొంతన ఉండటం లేదనే విమర్శలు లేక పోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement