చర్యలు తీసుకుంటాం
కిరాణా దుకాణాల్లో కూడా..
పరిగి: నియోజకవర్గంలో మెడికల్ దందా జోరుగా సాగుతోంది. ఔషధ నియంత్రణ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా దుకాణాలను నిర్వహిస్తున్నారు. మందుల షాపుల్లో తప్పనిసరిగా ఫార్మసిస్టు ఉండాలి. వారే విక్రయించాల్సి ఉంటుంది. కానీ అర్హత లేని వారితో షాపులు నడిపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. దుకాణాలపై అధికారులకు నియంత్రణ కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడు తనిఖీలు చేసి వారు ఇచ్చే మామూళ్ల తీసుకుంటూ మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
50కి పైగా మెడికల్ షాపులు
పరిగి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూరు, చౌడాపూర్ మండలాల్లో 50కి పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. 90శాతం దుకాణాల్లో ఫార్మసిస్టులు లేరు. అనర్హులు మందు విక్రయించడం ఆందోళన కలిగిస్తోంది. డాక్టర్ ఒక రకం రాస్తే రోగులకు మరో రకం మందులు అంటగడుతున్నారు. పరిగి పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో అనధికార మెడికల్స్ ఉన్నాయి. వాటిని ఆర్‌ఎంపీలు, పీఎంపీలు నిర్వహిస్తున్నారు. విషయం సంబంధిత అధికారులకు తెలిసినా మామూళ్లకు ఆశపడి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
అద్దెకు సర్టిఫికెట్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీ ఫార్మసీ, డీ ఫార్మసీ పూర్తి చేసిన వారే మందుల దుకాణాలు నిర్వహించాలి. కానీ మెడికల్ రంగంలో ఏమాత్రం అనుభవం లేని వారు బీ ఫార్మసీ, డీ ఫార్మసీ సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని షాపులు పెట్టేస్తున్నారు. ఎక్కువ శాతం ఇలాంటి దుకాణాలే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారులకు విషయం తెలిసినా వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. మందుల కాంబినేషన్ తెలియని వ్యక్తులు విక్రయాలు చేస్తుండలం ఆందోళన కలిగిస్తోంది.
అనుమతులు లేని మెడికల్ షాపులు, అర్హత లేని వారు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించని షాపుల వివరాలను మా దృష్టికి తేవాలి. అలాంటి వాటిని సీజ్ చేస్తాం. తరచూ తనిఖీలు చేస్తూనే ఉన్నాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు.
– క్రాంతి కుమార్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, పరిగి
కిరాణా దుకాణాల్లో కూడా మందులు లభిస్తున్నాయి. తలనొప్పి.. జ్వరం.. ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు వంటి వాటికి మందులు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదు. కానీ షాపుల నిర్వాహకులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా బ్రాండెడ్ మందుల పేరుతో జనరిక్ మందులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఫార్మసీ కౌన్సిల్ గుర్తింపు ధ్రువపత్రంతో పాటు లైసెన్స్‌డ్ ఫార్మాసిస్టు ద్వారానే మందుల విక్రయాలు జరపాలి. మెడికల్ షాపును కనీసం 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్వహించాలి. ఈ నిబంధనలను ఎవ్వరూ పాటించడం లేదు. మందులు కొన్న వారికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి. కొందరు బిల్లులు అడిగినా ఇవ్వడం లేదు.
మందుల దుకాణాల్లో నిబంధనలకు పాతర
కనిపించని ఫార్మసిస్టులు
అర్హత లేనివారితో విక్రయాలు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్వాహకులు


