చిన్నారులను ఉత్సాహపర్చే ప్రశ్నలు
●ఆలోచనా శక్తిని పెంచే జవాబులు ●సరదాతో పాటు విజ్ఞానాన్ని పంచే పొడుపు కథలు
నోరులేదు కాని మాట్లాడగలను, పాడగలను నాపేరు చెప్పుకోండి చూద్దాం?
జవాబు: రేడియో
– దైవిక్, పరిగి
ఎప్పుడు చూసినా ఒక్కకాలు మీదే నిలబడి ఉంటుంది, ఏమిటది?
జవాబు: గొడుగు
– వి.మమత, పరిగి
రెక్కలు, తోక ఉన్నా.. పక్షిని కాను,
ఆకాశంలో ఎగురుతాను కానీ విమానం కాను,
మరి నేనెవరిని ?
జవాబు: గాలిపటం
– మాన్విత
కిటకిట తలుపుల కిటారి తలుపులు
ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు?
జవాబు: కంటి రెప్పలు
– శివకుమార్ కందనెల్లి
●అమ్మానాన్నకు ఆసరాగా..
దుద్యాల్: వేసవి సెలవుల వేళగ్రామీణ విద్యార్థులు తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. స్నేహితులతో కలిసి ఆడిపాడుతూనే.. అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటున్నారు. కొడంగల్ సమీపంలోని గంధంబావితండా వద్ద ధాన్యం ఆరబోస్తున్న తల్లిదండ్రులకు సాయం చేస్తున్న బాలుడిని సాక్షి తన కెమెరాలో బంధించింది.
బొంరాస్‌పేట:
‘పొదుపు కథలనెవరు పొందుగా పఠియించి
విప్పిచెప్పుకున్న విమలమైన
బుద్ధి వృద్ధియౌను భూలోక జనులందు
కలుగు చురుకు ధనము గలుగు శుభము!’
అంటూ సాహితీకారులు పొదుపుకథల ప్రాముఖ్యతను గొప్పగా చాటుతూనే ఉన్నారు. ఇవి చిన్నారుల ఆలోచనా శక్తికి పదును పెడుతాయి. వింతగా, వినోదంగా ఉంటూ చిన్నారులకు గిలిగింతలు పెట్టిస్తాయి. వినోదం, వికాసంతో పాటు లోకజ్ఞానం, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
పరోక్షంగా ప్రశ్నలు వేస్తూ
చిన్నారులకు నాయనమ్మలు చెప్పేకథలు, తాతయ్యలు విప్పి చెప్పే కల్పిత కథలు ఎంతో ఆనందాన్నిస్తూ నిద్రొచ్చే వరకూ జోకొడుతుంటాయి. కాగా మన నిత్యజీవితంలో చుట్టూ ఉండే అన్ని రకాల అంశాలపై పరోక్షంగా ప్రశ్నలు వేస్తూ విషయావగాహన కల్పించేవే పొడుపు కథలు. ప్రశ్నోత్తరాలతో కూడిఉండి చిన్నారుల్లో తెలుసుకోవాలనే జిజ్ఞాసను కల్పిస్తాయి. ప్రశ్నల్లో ఉండే మర్మము తెలిస్తేనే జవాబును పట్టేస్తారు. ఇలాంటి పొడుపు కథలు తెలగు భాష పరిరక్షణకు సైతం పాటుపడుతాయని సాహితీవేత్తలు చెబుతున్నారు. సెలవుల వేళ పిల్లల్లో వీటిపై ఉన్న ఆసక్తినిపెంచే క్రమంలో ‘సాక్షి’ చేస్తున్న చిరు ప్రయత్నం ఇది..
పొడుపు శతకం
బొంరాస్‌పేట మండల పరిధిలోని వడిచర్లకు చెందిన కవి, తెలుగు ఉపాధ్యాయుడు వడిచర్ల సత్యం రచించిన ‘విప్పిచెప్పుబాల’ అనే 116 పొడుపు కథల పుస్తకం జిల్లా విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంటోంది. సర్వశిక్షా అభియాన్‌లో భాగంగా ప్రభుత్వం ఈ పుస్తకాన్ని ముద్రించింది. ఇందులోని 116 పొడుపు కథలు పాఠశాల విద్య చదువుతున్న బాలబాలికల నోళ్లలో నానుతుంటాయి.
‘జతను వీడిపోరు జగడమాడరువారు
అందమంతయేరి ఆరగించి
కలిసి మెలిసిఉన్న కనరొకరినొకరు
విప్పిచెప్పు బాల వినయశీల!’
అంటూ.. ‘రెండు కళ్లు’ గురించి చెప్పిన పొడుపు కథలతోపాటు నమస్కారం, శుభాకాంక్షలు, మంగళసూత్రం, కుంకుమబొట్టు, పక్షులు, జంతువులు, క్రిములు, లోహాలు, యంత్రాలు, ఇంట్లోవాడే వస్తువులు, కూరగాయలు, పండ్లు, సెల్‌ఫోన్, గడియారం, రేడియో, కంప్యూటర్, అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలు వంటి అనేకరకాల పొడుపుకథల పుస్తకం ప్రతి సర్కారుబడి, అంగన్‌వాడీల్లో దర్శనమిస్తున్నాయి.
●చెట్టు నీడన క్రికెట్టు!
మంచాల: ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక, ఎండ వేడిమికి ఆరు బయట ఆడుకోలేక అవస్థలు పడుతున్న చిన్నారులు.. చల్లని చెట్ల నీడలను ఆశ్రయిస్తున్నారు. మంగళవారం నోముల గ్రామంలో చెట్ల కింద క్రికెట్ ఆడుతున్న పిల్లలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది.
తెల్లటిపొలంలో నల్లటి విత్తనాలు?
జవాబు: పుస్తకంలోని అక్షరాలు
– సుశాంత్, దిర్సంపల్లితండా


