ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య సూచించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిరిసిల్ల రాజయ్య, సభ్యులకు అదనపు కలెక్టర్‌ కిరణ్మయి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. నగర పాలక సంస్థలు, మున్సిపల్‌ పట్టణాలు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా, వీధి దీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు సక్రమంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. సదస్సులో ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, ఎస్‌.సుధీర్‌ రెడ్డి, దక్షిణ జిల్లాల అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్‌, ఫణీంద్రరెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్‌ మోహన్‌, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు, డీపీఓలు, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రట్రీలు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య

Advertisement
 
Advertisement
Advertisement