కలెక్టర్ దీపక్ తివారి
అనంతగిరి: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 150 దరఖాస్తులు వచ్చాయని.. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ పరిదిలో నిర్వహిస్తున్నామని, డివిజన్ పరిధిలో వచ్చే దరఖాస్తులను సంబంధిత డివిజన్ అధికారులే పరిష్కరించాలని చెప్పారు. 30 రోజుల్లో సమ స్య పరిష్కరించేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్‌డీఏ శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బాధితులకు భరోసా
కల్పించేందుకు ప్రజావాణి
ఎస్పీ స్నేహ మెహ్ర
అనంతగిరి: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, బాధితులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పీఎస్ అధికారులతో కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.చట్ట పరిధిలో ఉన్న సమస్యలను ఏమాత్రం జాప్యం చేయకుండా పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
ప్రయోగాత్మక విద్యకు ల్యాబ్‌లు దోహదం
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి
బొంరాస్‌పేట: సైన్స్ ల్యాబ్‌లు విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యలో ఉపకరిస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో స్థానిక జీహెచ్‌ఎం, ఎంఈఓ హరిలాల్‌తో కలిసి సైన్‌ల్యాబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాఠశాలకు రూ.21లక్షలు మంజూరైన పీఎంశ్రీ నిధులతో ఈ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, డైరెక్టర్ మల్లేశ్, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు బేగరి రాములు, ఉపసర్పంచ్ నందినిసాగర్, మైనుద్దీన్, ఉపాధ్యాయ బృందం బాకారం చంద్రశేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
చైతన్యకు ప్రతిభ పురస్కారం
మర్పల్లి: ఇటీవల విడుదలైన పదో తరగతిఫలితాల్లో మండల టాపర్‌గా నిలిచిన ఘణాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థి పట్లోళ్ల చైతన్య సోమవారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ప్రతిభ పురస్కారం అందుకుంది. స్కూల్ హెచ్‌ఎం, ఎంఈఓ అశోక్‌తో కలిసి ప్రశంసపత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, నర్సింలు, కవిత, నాగభూషణం, సీఆర్‌పీ మల్లేశం విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.


