శంకర్‌పల్లి: అప్పటిదాక అందరితో ఆడుతూ అల్లరి చేసిన చిన్నారిని అనుకోని ప్రమాదం వెంటాడింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఆదివారం మోకిల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. జన్వాడకు చెందిన కాట్నే శేఖర్, మేఘన దంపతులకు ఒక కుమారుడు, కూతురు ప్రియాన్షు(3) ఉన్నారు. శేఖర్ ప్రైవేటు ఉద్యోగి. ఉదయం వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లగా.. తల్లి ఇంట్లో పనులు చేస్తుంది. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ప్రియాన్షు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడింది. కాసేపటికి చిన్నారి ఎక్కడ అని వెతికిన తల్లికి.. చివరికి సంపులో తేలియాడుతూ విగతజీవిగా కనిపించింది. చిన్నారి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.


