యాలాల: మండలంలోని జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం చించోళి నుంచి మహబూబ్‌నగర్ వరకు నాలుగు లేన్ల పనులు చేపట్టారు. ఇందులో భాగంగా ఏడాది క్రితం మండలంలోని లక్ష్మీనారాయణపూర్ నుంచి తాండూరు వరకు రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. కొన్ని నెలల పాటు వేగంగా సాగినప్పటికీ ఆ తర్వాత నెమ్మదించాయి. పనులు పర్యవేక్షిస్తున్న ప్రాజెక్టు మేనేజర్లు మారుతున్నారే తప్ప ఎలాంటి పురోగతి కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాల రాకపోకల కారణంగా దుమ్ము రేగుతోంది. అసంపూర్తి కల్వర్టులు, పనులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. నెల వ్యవధిలో ఈ మార్గంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
జాతీయ రహదారి పనులు చేపట్టే మార్గంలో బ్రిడ్జిలు, కల్వర్టులు, డ్రైనేజీలు నిర్మించాల్సి వస్తే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో కాంట్రాక్టర్ విఫలమయ్యారు. లక్ష్మీనారాయణపూర్ నుంచి తాండూరు శివారు వరకు సుమారు 4 కిలో మీటర్ల మేర విస్తరణ పనులు జరుగుతున్నాయి. తిమ్మాయిపల్లి గేటు నుంచి తాండూరు పట్టణ శివారు వరకు అనేక చోట్ల కల్వర్టులు, భారీ డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. ఈ పనులు జరిగే ప్రదేశం వద్ద హెచ్చరిక బోర్డులు కానీ సైన్ బోర్డులు కానీ ఏర్పాటు చేయలేదు. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏర్పాటు చేయలేదు. గత నెల 13న ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణపూర్ సమీపంలో నిర్మిస్తున్న కల్వర్టులోకి బైక్‌తో సహా దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. హైవే పనులు అసంపూర్తిగా.. నిర్లక్ష్యంగా జరుగుతుండటమే తన భర్త మృతికి కారణమని కానిస్టేబుల్ భార్య యాలాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే మార్గంలో గత గురువారం సాయంత్రం దౌల్తాబాద్ మండలం తిమ్మాయిపల్లికి చెందిన ఓ యువకుడు గుంతలమయమైన రోడ్డు కారణంగా బైక్ పైనుంచి కింద పడటం.. అదే సమయంలో వెనక వస్తున్న నీటి ట్యాంకర్ అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా పనుల్లో ఏ మాత్రం వేగం పెరగలేదు.
జాతీయ రహదారి విస్తరణ పనులు వాహనదారుల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నత్తనడకన పనులు.. కల్వర్టులు, డ్రైనేజీలు నిర్మించే చోట ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. నెలలోపే ఇద్దరు మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత దురుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
నరకమే!
కిలోమీటర్లు
ప్రత్యామ్నాయ మార్గాలు లేక..
ప్రమాదకరంగా లక్ష్మీనారాయణపూర్ – తాండూరు రోడ్డు
నత్తను తలపిస్తున్న జాతీయ రహదారి విస్తరణ పనులు
తరచూ యాక్సిడెంట్లు
నెలలోపే ఇద్దరి దుర్మరణం
పట్టించుకోని అధికారులు