విద్యా వారోత్సవాలను విజయవంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

విద్యా వారోత్సవాలను విజయవంతం చేద్దాం

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

విద్యా వారోత్సవాలను విజయవంతం చేద్దాం 16, 18న ఇంటర్‌లో చేరేందుకు కౌన్సెలింగ్‌ ప్రేమ పేరుతో బాలిక కిడ్నాప్‌ బైక్‌ను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్‌

కలెక్టర్‌ దీపక్‌ తివారి

అనంతగిరి: జిల్లా వ్యాప్తంగా నేటి(సోమవారం) నుంచి 17వ తేదీ వరకు జరగనున్న విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్‌ నుంచి అన్ని మండలాల అధికారులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి విద్యా వారోత్సవాలను ప్రారంభిస్తారని ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి విద్యార్థులు, వారి తల్లితండ్రులు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇందుకు కోసం 40 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి మండలం నుంచి రెండు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. సమావేశంలో డీఈఓ రేణుకాదేవి, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.

కొడంగల్‌ రూరల్‌: గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఇంటర్‌లో చేరేందుకు మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 16న బాలురకు, 18న బాలికలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్‌ కే నాగార్జునరావు ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి రోడ్‌లోని గిరిజన గురుకుల బాలుర జూనియర్‌ కళాశాలలో ఉదయం 10గంటల నుంచి కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని తెలిపారు. 2025 – 26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన మార్కుల మెమో, బదిలీ ధ్రువపత్రం, స్టడీ, కండక్ట్‌ సర్టిఫికెట్‌, కుల ధ్రువీకరణ పత్రం, 2026 – 27 ఆదాయ ధ్రువీకరణ పత్రం.. గ్రామీణ ప్రాంతం వారు రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతం రూ.2 లక్షలు మించరాదన్నారు. ఆధార్‌ జిరాక్స్‌, స్పోర్ట్స్‌, పీహెచ్‌సీ ధ్రుకరణ పత్రం, 3 కలర్‌ ఫొటోలు, రెండు జతల జిరాక్స్‌ కాపీలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఆయన తెలిపారు.

ఢిల్లీకి చెందిన వ్యక్తి అరెస్టు

తాండూరు టౌన్‌: ప్రేమ పేరుతో బాలికను కిడ్నాప్‌ చేశాడు ఓ వ్యక్తి. బతుకుదెరువు కోసం తాండూరుకు వచ్చి అభం శుభం ఎరుగని 16 ఏళ్ల అమ్మాయిని ప్రేమ పేరుతో వలలో పడేశాడు. బాలికను ఢిల్లీ తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సదరు నిందితునిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆరు నెలల క్రితం ఢిల్లీకి చెందిన ఆదీమ్‌(28) అనే వ్యక్తి వలస వచ్చి తాండూరు రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఢిల్లీ సెలూన్‌లో పని చేస్తూ, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలికను ప్రేమ పేరుతో ట్రాప్‌ చేశాడు. ఎవరికీ తెలియకుండా శనివారం తీసుకుని ఢిల్లీకి పారిపోయేందుకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లో ఆదీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

వ్యక్తికి తీవ్ర గాయాలు

యాలాల: వేగంగా, అజాగ్రత్తగా వెళుతున్న ఓ ఇసుక ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటన మండలంలోని దౌలాపూర్‌ సమీపంలో మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన మహ్మద్‌ మోయిజ్‌ వ్యాపార పనుల నిమిత్తం దౌల్తాబాద్‌ మండలం హుస్నాబాద్‌కు వెళ్లి మధ్యాహ్నం వేళ తన బైక్‌పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దౌలాపూర్‌ సమీపంలోకి రాగానే అగ్గనూరు గ్రామానికి చెందిన రవిగౌడ్‌కు చెందిన ట్రాక్టర్‌ ఇసుక లోడ్‌తో వేగంగా వెళ్తుండగా ముందు టైరు పేలింది. ఈ క్రమంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న మోయిజ్‌ను ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఎడమకాలికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మోయిజ్‌ను నగరానికి రిఫర్‌ చేశారు. క్షతగాత్రుడి కొడుకు ఫాజిల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement