తాండూరు: పదో తరగతి పాసైన విద్యార్థులకు ప్రైవేటు కాలేజీలు వల వేస్తున్నాయి. ఎన్నికలను తలపించేలా ఇంటింటికి వెళ్లి తమ కళాశాలలోనే పిల్లలను చేర్పించాలంటూ ప్రచారం చేస్తున్నారు. టెన్త్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే ప్రచారం జోరందుకుంది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల వివరాలు సేకరించి.. బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో తిరుగుతున్నారు. అమ్మా.. అయ్యా అంటూ మీ పిల్లలను మా కాలేజీలోనే చేర్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఫీజులో మినహాయింపు, ఆఫర్లు ఉన్నాయంటూ ఊదరగొడుతున్నారు.
పదిలో 12,302 మంది ఉత్తీర్ణత
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, రెసిడెన్సియల్, కేజీబీవీల్లో 13,482 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. గత నెల చివరి వారంలో ఫలితాలు వెలువడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 12,302 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిని తమ కళాశాలలో చేర్పించాలంటూ యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. మరి కొన్ని కళాశాలలు జేఈఈ, ఐఐటీ బోధన ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ఇంటర్‌లో ర్యాంక్ వచ్చిన విద్యార్థుల ఫొటోలు చూపుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర కళాశాలలతో పోలిస్తే తమ కాలేజీలో ఫీజు తక్కువ అని చెబుతున్నారు.
ప్రైవేటు స్కూళ్లదీ అదే బాట
జిల్లాలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఏటా పెరుగుతోంది. పదేళ్ల క్రితం వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ప్రైవేటు స్కూళ్లు నేడు మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇబ్బడి ముబ్బడిగి వెలుస్తున్నాయి. వారు కూడా విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రచారం మొదలు పెట్టారు. బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ తిరుగుతున్నారు.
ఉత్తీర్ణులైన వారి ఇళ్లకు ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు
ఫీజు మినహాయింపు అంటూ తాయిలాలు
ఆఫర్లతో అదరగొడుతున్న యాజమాన్యాలు


