అనంతగిరి: జనగణన ఎంతో కీలకమని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల విభాగం అధికారి అబ్దుల్ సత్తార్ పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్ నుంచి ఎన్నెపల్లి చౌరస్తా వరకు జనగణనపై అవగాహన వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని తెలిపారు. నేటి నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తారని తెలిపారు. సిబ్బంది ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేశామని వారికే వివరాలు తెలియజేయాలన్నారు. జనగణన పేరిట అపరిచితులు వివరాలు సేకరించే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, టీఎంసీ వెంకటేశ్, సహాయ సంచాలకులు రవిచంద్ర పాల్గొన్నారు.


