పశువులు తరలిస్తున్న వ్యక్తిపై కేసు | - | Sakshi
Sakshi News home page

పశువులు తరలిస్తున్న వ్యక్తిపై కేసు

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

నిజాయతీ చాటుకున్న కండక్టర్‌ రోడ్డు దాటుతుండగా.. వాగులో మునిగి బాలుడి మృతి

తాండూరు టౌన్‌: అనుమతి లేకుండా రెండు ఎద్దులను తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్‌ ఆదివారం తెలిపారు. రసూల్‌ అనే వ్యక్తి ట్రాలీ వాహనంలో పెద్దేముల్‌ మండలం గాజీపూర్‌కు రెండు ఎద్దులను తరలిస్తున్నాడు. బక్రీదు పర్వదినాన్ని పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణాను నివారించుటలో భాగంగా అంతారం వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. తనిఖీలో అనుమతి లేకుండా ఎడ్లను తరిలిస్తున్నట్లు తెలిసింది. అయితే గతంలో రెండు ఎడ్లను మహారాష్ట్రలో కొనుగోలు చేసిన రసూల్‌, బషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించాడు. అతడు డబ్బులు ఇవ్వకపోవడంతో రెండు ఎడ్లను వాహనంలో తీసుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పశువులను రవాణా చేసే క్రమంలో తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలని పట్టణ సీఐ తెలిపారు.

ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కండక్టర్‌ నిజాయతీ చాటుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఆదివారం ఇబ్రహీంపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు హడవుడిగా దిగుతూ బ్యాగు మరిచిపోయింది. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్‌ ఆ బ్యాగును గుర్తించారు. అందులో రెండున్నర తులాల బంగారు గొలుసు, ఆధార్‌, ఏటీఎం కార్డులున్నాయి. ఆధార్‌ కార్డులోని ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సదరు ప్రయాణికురాలికి సమాచారం ఇచ్చారు. తిరిగి బొంగుళూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్దకు వారి కుటుంబసభ్యులు రాగా బ్యాగును వారికి అందజేశారు. విలువైన వస్తువులు మళ్లీ దక్కడంతో వారు కండక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్‌ సుజాత కండక్టర్‌ సీతారాం నిజాయతీని అభినందించారు.

బైకు ఢీకొని వృద్ధురాలి మృతి

హయత్‌నగర్‌: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని వేగంగా వచ్చిన బైకు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. బైకు నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన బీర్ల జంగయ్య భార్య లక్ష్మమ్మ (80) తొర్రూర్‌ గ్రామంలో జరుగుతున్న బీరప్ప పండుగకు బంధువుల ఇంటికి వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా మునుగనూరు వైపు నుంచి వేగంగా వచ్చిన బైకు (టీఎస్‌ 07 జీఎఫ్‌0071) లక్ష్మమ్మను ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బైకు నడుపుతున్న పవన్‌కు గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శంషాబాద్‌ రూరల్‌: వాగులో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన శంషాబాద్‌ మండలం ననాజీపూర్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఈదులనాగులపల్లికి చెందిన బ్యాగరి హనుమంతు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 8న ననాజీపూర్‌లో బంధువుల గృహ ప్రవేశానికి వచ్చారు. మరుసటి రోజు ఆయన కుమారుడు శ్రీచరణ్‌ (17) బహర్భూమి కోసం బైక్‌పై వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో పలు చోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు. ఆదివారం ననాజీపూర్‌ శివారులోని వాగు నీళ్లలో శ్రీచరణ్‌ మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు వాగునీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

దేశ రక్షణ

హిందువుల లక్ష్యం

ఆధ్యాత్మిక వక్త భూమానందగిరి స్వామి

అబ్దుల్లాపూర్‌మెట్‌: కులాలను పక్కనపెట్టి.. దేశ రక్షణకు హిందువుల మంతా ఏకమవుదామని ఆధ్యాత్మిక వక్త భూమానందగిరి స్వామి పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) వదేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం రాత్రి మండల పరిధి కవాడిపల్లి కోదండ రామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను సమైక్యంగా ఎదురుకొందామని పిలుపునిచ్చారు. హిందు సమాజం పట్ల గౌరవం, స్వధర్మం పట్ల అంకితభావం, సేవాగుణం వికసింపజేయాలన్న లక్ష్యంతో చేపట్టిన హిందూ సమ్మేళనాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మహిళా వక్త డాక్టర్‌ కళ్లెం స్వప్న, సంఘ వక్త సదావెంకట్‌రెడ్డి, బలిజగూడ సర్పంచ్‌ మాధవి, సమ్మేళన నిర్వహణ సమితి నాయకులు జానకి, మాధవి, వరమ్మ, ధర్మారెడ్డి, బాలకృష్ణగౌడ్‌, జగదీష్‌, జైపాల్‌రెడ్డి, మహేశ్‌, నాగభూషన్‌రెడ్డి, మల్లికార్జున, రవీయాదవ్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement